Draupadi Murmu Telangana Tour : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర పర్యటనకు సర్వం సిద్ధమైంది. శీతాకాల విడిది కోసం వస్తున్న రాష్ట్రపతి.. ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. దిల్లీ నుంచి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు భారత వాయిసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న ద్రౌపదీ ముర్ము.. అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరుతారు. విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ద్రౌపదీ ముర్ముతో పాటు శ్రీశైలం వెళ్తారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం కింద వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరుగుపయనమై సాయంత్రం 4:15 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు.
రాష్ట్రపతి హోదాలో మొదటిసారి రాకా: రాష్ట్రపతి హోదాలో మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న ద్రౌపదీ ముర్ముకు ఘనంగా స్వాగతం పలకాలని, అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మంత్రులందరూ రిసెప్షన్‌కు రావాలని స్పష్టం చేశారు. హకీంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత యుద్ధ వీరుల స్మారకం వద్ద అమరులకు అంజలి ఘటిస్తారు. అనంతరం రాష్ట్రపతి నిలయం బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి ముర్ము గౌరవార్థం గవర్నర్ తమిళిసై సాయంత్రం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు.
పర్యటనలో భాగంగా ద్రౌపదీ ముర్ము భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శిస్తారు. భద్రాచలం, రామప్ప వద్ద కేంద్ర పర్యాటక శాఖ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. భద్రాద్రిలో సమ్మక్క-సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. కుమురం భీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను రాష్ట్రపతి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. రామప్ప ఆలయం వద్ద పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుకు, కామేశ్వరాలయ పునరుద్ధరణకు శంకుస్థాపన చేస్తారు.
సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించున్న రాష్ట్రపతి..: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ సందర్శించనున్న రాష్ట్రపతి.. శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. మిధానిలో వైడ్ ప్లేట్ మిల్‌ను ప్రారంభిస్తారు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ, జి.నారాయణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించనున్న ముర్ము.. అక్కడ విద్యార్థులతో సంభాషిస్తారు. హైదరాబాద్ శివారులో ఉన్న సమతా మూర్తి విగ్రహాన్ని కూడా రాష్ట్రపతి సందర్శిస్తారు.
ఈ నెల 30న రాష్ట్రపతి నిలయంలో విందు ఏర్పాటు చేసిన ద్రౌపదీ ముర్ము.. దక్షిణాది విడిది ముగించుకొని అదే రోజు సాయంత్రం దిల్లీకి తిరుగుపయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే చేసింది. రహదారుల మరమ్మతులు, బారికేడింగ్, తదితర పనులను పూర్తి చేసింది. విద్యుత్, వైద్య బృందాలు నిత్యం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేసింది. 1500 మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాల సహాయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
ఇవీ చదవండి: