ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు లభిస్తాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షలకు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఆధ్వర్యంలో పాలిసెట్-2020 అడ్మిషన్ నోటిఫికేషన్ మార్చి 2న విడుదల చేసింది. దీనిలో ప్రభుత్వ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4 డిప్లొమా కోర్సుల ప్రవేశాలు కూడా పాలిసెట్ మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచారు. పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 ఆఖరు గడువు. వర్సిటీ వివిధ కోర్సుల ప్రవేశం కోసం ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.
అయితే సీట్లు పాలిసెట్ ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తామని పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు విశ్వవిద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు 4 ఏళ్లపాటు గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి. పాలిసెట్ ర్యాంకు లేకుంటే విశ్వవిద్యాలయం డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉండదు. ఇతర అన్ని వివరాలు, నియమ నిబంధనలు, పాలిసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు కోసం వైబ్‌సైట్ www.polycetts.nic.in, www.sbtet.telangana.gov.in లో చూడొచ్చని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడు నీటి విషయంలో రేపు భాజపా నిరసన