ఆంధ్రప్రదేశ్ విశాఖ సాల్వెంట్స్ కర్మాగారంలో డై మిథలిన్ సల్ఫాక్సైడ్ డిస్టిలేషన్ ప్రక్రియ జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు విచారణ కమిటీ గుర్తించింది. రియాక్టర్‌ను వినియోగించే సమయంలో వ్యాక్యూమ్ 600 నుంచి 650 ఎంఎం ఉండాలి. సోమవారం రాత్రి 9 గంటల వేళ వ్యాక్యూమ్ ప్రెజర్ 350 ఎంఎం మాత్రమే ఉంది. 95 డిగ్రీలు ఉండాల్సిన ఉష్ణోగ్రత...75 డిగ్రీలు మాత్రమే ఉంది. డీఎంఎస్‌వో, టోలున్, మిథనాల్, అసిటోన్ రసాయనాల శుద్ధి కోసం వేర్వేరు వ్యాక్యూమ్ , ఉష్ణోగ్రతలు అవసరం. వ్యాక్యూమ్, ఉష్ణోగ్రతలు మారడం వల్ల రసాయనాలు మరిగే స్థానం తగ్గింది. మిశ్రమం మరిగే స్థానం తగ్గి రియాక్టర్‌పై ఒత్తిడి పెరిగి పేలుడు సంభవించినట్లు విచారణ కమిటీ పేర్కొంది.
సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు విచారణ కమిటీ వెల్లడించింది. 9 గంటల సమయంలో షణ్ముఖం అనే ఉద్యోగి విధుల నుంచి వెళ్లిపోయే సమయంలో ఓ యూనిట్లో వ్యాక్యూమ్ పడిపోతుందని...అది ప్రమాదకరమని...తర్వాత షిప్ట్‌కు వచ్చిన ఉద్యోగికి తెలిపారు. అయినా సిబ్బంది యథావిధిగా ఉత్పత్తి కొనసాగించారు. ఆ సమయంలో నైట్‌షిఫ్ట్ డ్యూటీలోకి వచ్చిన కెమిస్ట్ మల్లేశ్వరరావు పరిస్థితిని గమనించి వెంటనే అప్రమత్తమై రియాక్టర్‌కు స్టీమ్ సరఫరా నిలిపి వేశారు. ఆ తర్వాత 102 రియాక్టర్ యాజిటేటర్ షాఫ్ట్ సీల్ నుంచి పొగ వ్యాప్తి చెందడాన్ని గమనించి జూనియర్ ఆపరేటర్ శ్రీనివాసరావును అప్రమత్తం చేసి ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంతలో రియాక్టర్ పేలి శ్రీనివాసరావు మృతిచెందగా...మల్లేశ్వరరావు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
మృతుడు శ్రీనివాసరావు కుటుంబానికి 50 లక్షలు పరిహారం ప్రకటించగా....యాజమాన్యం నుంచి 35 లక్షలు సీఎం సహాయ నిధి నుంచి మరో 15 లక్షలు ఇవ్వనున్నారు. గాయపడిన సిబ్బందికి 20 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించనున్నారు. చికిత్స పొందుతున్న మల్లేష్‌కు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.
ఇవీచూడండి: జీహెచ్‌ఎంసీలో కంటైన్మెంట్ జోన్లు.. అడిషనల్ కమిషనర్లకు బాధ్యతలు