Praja Darbar at Praja Bhavan Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా భవన్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. భారీగా తరలివచ్చిన ప్రజల నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి సొంత వాహనంలోనే ప్రజా భవన్‌కు రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సుమారు గంట పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను సీఎంకు విన్నవించారు. వారి సమస్యలను విన్న రేవంత్, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Telangana Praja Darbar First Day : ఇదిలా ఉండగా ప్రజా దర్బార్ కోసం అధికారులు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. వైద్య సేవల కోసం అక్కడ హెల్త్ క్యాంప్ సైతం అందుబాటులో ఉంచారు. శుక్రవారం నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు గురువారం తన ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా భవన్ వద్దకు చేరుకున్నారు.
ఉదయం 11:30 గంటల వరకు వినతులు స్వీకరించిన రేవంత్ ఆ తర్వాత అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లిపోయారు. సీఎం వెళ్లిన తర్వాత హెల్ప్ డెస్క్ ద్వారా అధికారులు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చాలా కాలం తర్వాత ప్రజా భవన్‌లోకి రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా భవన్ వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సంబుర పడిపోయారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నా వినతి పత్రం అందించాను. ముఖ్యమంత్రి స్వయంగా నా అప్లికేషన్ తీసుకున్నారు. నేను చెప్పింది శ్రద్ధగా విన్నారు. ఒక ఎమ్మెల్యేను కలవాలంటేనే ఎంతో మంది అధికారులను దాటుకుని రావాలి. అలాంటిది రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత ఈజీగా కలుస్తానని అనుకోలేదు. - అర్జీదారులు
ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచె తొలగింపు - నేడు ప్రజా దర్బార్ నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో పలువురు మంత్రులు, అధికారులు కలిశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు తదితరులు సీఎంను కలిశారు. వీరితో పాటు ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి శివధర్ రెడ్డి, సీవీ ఆనంద్ రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి తన నివాసం నుంచి తన సొంత వాహనంలోనే జ్యోతిరావుపూలే ప్రజా భవన్‌కు తరలి వెళ్లారు. ప్రజా భవన్‌లో జరిగిన ప్రజా దర్బార్‌లో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ ఎండీ భేటీ - ఉచిత ప్రయాణం మార్గదర్శకాలపై చర్చ