సాంప్రదాయేతర ఇంధన వనరులపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టిసారించారు. సహజసిద్దంగా వీచే గాలి, ఇళ్ల నుంచి వచ్చే చెత్త నుంచి విద్యుత్‌ను తయారు చేసే ఔత్సాహిక సంస్థలకు చేయూతనిస్తున్నారు. ఆ దిశగా విద్యుత్ శాఖ కృషిచేస్తోంది. ఇప్పటికే సూర్యుడి నుంచి వెలువడే కిరణాలతో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ వినియోగించే వారికి పలు ప్రోత్సాహకాలను విద్యుత్ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వీటిని వినియోగిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఒక్క మెగా యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి కాలేదు... ఆరేళ్లలో 3,722 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంది.
రాష్ట్రంలో పరిశ్రమలు, గృహ వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. ఇటీవలి కాలంలో 13,168 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్‌లో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగినా... రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిసారించింది. ఆ దిశగా విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 3,722 మెగావాట్ల సౌర విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 130 మెగావాట్లు కేవలం పైకప్పుల ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. సౌర విద్యుత్ ను మరింత ఉత్పత్తి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు ఆలోచనచేస్తున్నారు.
ఒకవైపు సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిసారిస్తూనే.. మరోవైపు గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేస్తోంది. పరిగిలో గాలిద్వారా విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించింది. పరిగిలో గాలి బాగా వీస్తుంది. ఆ ప్రాంతంలో ఓ ప్రైవేట్ సంస్థ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇలా గాలి ద్వారా 100.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీటితో పాటు గ్రేటర్ పరిధిలోని జవహార్ నగర్ డంప్ యార్డులో చెత్త నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ లు దిల్లీ, అహ్మదాబాద్ లో ఇప్పటికే ఉన్నాయి.
దక్షిణ భారతదేశంలో తొలి ప్లాంట్ గా జవహార్ నగర్ ప్లాంట్ ఆవిర్భవించబోతోంది. గ్రేటర్ పరిధిలో సగటున ప్రతి రోజు 6,300ల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుంది. చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి తడి చెత్తతో సేంద్రీయ ఎరువులు, పొడిచెత్తతో విద్యుత్ ను ఉత్పత్తి చేయవచ్చు. జవహార్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి రోజుకు సుమారు 12వందల నుంచి 13వందల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగించనున్నారు. 18.6 మెగావాట్ల విద్యుత్ ను జవరహార్ నగర్ డంపింగ్ యార్డ్ నుంచి ఉత్పత్తి చేయబోతున్నారు. విద్యుత్ శాఖ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ తో పాటు సౌర విద్యుత్, గాలి విద్యుత్ తో పాటు.. వ్యర్థాల నుంచి కూడా విద్యుత్ ప్రారంభిస్తే కరెంట్ వినియోగం పెరిగినా ఎలాంటి ఇబ్బందులుండవు.
ఇదీ చూడండి: 'దట్టమైన పొగల వల్లే లోనికి వెళ్లడం కష్టమవుతోంది'