ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వనస్థలిపురం, హస్తినాపురం, లింగోజిగూడ, చంపాపేటలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్ శాఖకు ప్రజలు ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆ నంబర్లు పనిచేయక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మల్లాపూర్ భవానీనగర్ నాలాలో పడిన బాలికను జీహెచ్ఎంసీ సిబ్బంది రక్షించారు. చిన్న చర్లపల్లి నుంచి పారిశ్రామికవాడ రహదారిపై చెట్టు, సైదాబాద్ పూసల బస్తీ కమాన్ వద్ద ఓ ఇంటి గోడ, బ్రహ్మపురి కాలనీలోని గుల్మోర్ అపార్ట్మెంట్లో గోడ కూలింది. అలాగే కాప్రా చెరువు నాలా ప్రవాహంతో అపార్ట్మెంట్ ప్రహరీ గోడ కూలింది.
బేగంపేట బ్రాహ్మణవాడ, బ్రహ్మపురి కాలనీలోన్ని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మల్కాజిగిరి బండ చెరువు నుంచి ఉద్ధృతంగా వరద ప్రవాహిస్తోంది. వరదల కారణంగా ఎన్‌ఎండీసీ కాలనీలో సెల్లార్లలోకి వరద నీరు చేరింది. ఉస్మాన్ గంజ్ ప్రాంతంలో వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. బైరామల్‌గూడ చెరువు నిండుకుండలా మారింది. కాలువ పక్కన ఉన్న రేకుల ఇళ్లలోకి వరద నీరు ప్రవహించింది. ముంపు బాధితులకు జీజేఆర్ గార్డెన్‌లో అధికారులు పునరావాసం కల్పించారు. శంకర్‌పల్లి-హైదరాబాద్ మార్గంలో బుల్కాపూర్ వద్ద విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.
ఇదీ చదవండి: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో భారీ వర్షాలు