Govt Job notifications in Telangana: చాలా కాలంగా యువత ఎదురుచూస్తోన్న ఉద్యోగ నియామకాల ప్రకటనలు త్వరలో రానున్నాయి. అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ దిశగా అవసరమైన కసరత్తు దాదాపుగా పూర్తైందని తెలిపాయి. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియ పూర్తి కాగా... 50 వేల 900 మంది ఉద్యోగులు స్థానికతల ఆధారంగా కొత్త పోస్టింగులకు వెళ్లారు. అప్పీళ్ల ప్రక్రియ పూర్తి కాగా.. స్పౌస్కేసుల్లో కొన్ని మాత్రమే ఇంకా తేల్చాల్సి ఉన్నట్లు తెలిసింది.
70 వేలకు పైగా ఖాళీలు..
ఇదే సమయంలో శేషాద్రి నేతృత్వంలోని ఐఏఎస్ అధికారుల కమిటీ కసరత్తును పూర్తి చేసింది. గతంలో గుర్తించిన ఖాళీలతో పాటు.. కొత్త మున్సిపాలిటీల్లో అవసరమైన పోస్టులు, పదోన్నతులు, పదవీ విరమణల ద్వారా ఉత్పన్నమయ్యే ఖాళీలను పరిగణలోకి తీసుకొని.. మొత్తం జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 70 వేలకు పైగా ఖాళీలను గుర్తించినట్లు సమాచారం. ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు, జాబితా ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి రానున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వారికి ఎడిట్ ఆప్షన్..
new zonal system in telangana: రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా నియామకాల ప్రక్రియ పూర్తి చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమవుతోంది. 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు బహుళ జోన్ల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులను టీఎస్పీఎస్సీ చేపట్టింది. అభ్యర్థుల దరఖాస్తుల్లోనూ ఆ ప్రకారం సవరణలు చేయాల్సి ఉంది. ఇప్పటికే కమిషన్ వద్ద వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి.. త్వరలోనే ఎడిట్ ఆప్షన్ ఇవ్వనున్నారు. ఓటీఆర్ నమోదు చేసుకున్న వారు.. తమ విద్యార్హతలు, చదువుకున్న ప్రాంతాల వివరాలను మరోమారు నమోదు చేయడం ద్వారా కొత్త స్థానికతలను ఖరారు చేస్తారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాల ప్రక్రియ జరిగేందుకు ఆస్కారం కలుగుతుంది. ఇందుకోసం దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వనుంది.
ఇదీ చూడండి: Medaram Jatara 2022: మేడారం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం.. ధరలు, ప్రత్యేకతలివే..