రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ప్రకటించింది. ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మండలి విడుదల చేసింది. ఈనెల 18న జరిగిన పాలిసెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 92 వేల 556 మంది హాజరయ్యారు. పాలిటెక్నిక్, వ్యవసాయ, పశువైద్య డిప్లొమా కోర్సులతో బాసర ఆర్జీకేయూటీ సీట్లను కూడా పాలిసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు:
ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు
ధ్రువపత్రాల పరిశీలన కోసం ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలని కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది.
వచ్చేనెల 23న తుదివిడత కౌన్సిలింగ్
ఆగస్టు 23న తుది విడత పాలిసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్ సీట్లు కేటాయిస్తారు.
సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం
సెప్టెంబరు 1న విద్యా సంవత్సరం ప్రారంభించి.. 6 నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు నవీన్ మిత్తల్ పేర్కొన్నారు. స్పాట్ అడ్మిషన్ల కోసం సెప్టెంబరు 1న మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు.