హైదరాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ప్రభుత్వం ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది . వాహన కాలుష్యాన్ని తగ్గించే దిశగా హైదరాబాద్ నగర మహాపాలక సంస్థ మరో ముందడుగు వేసింది. జీహెచ్ఎంసీకి ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను అందించనుంది. ప్రస్తుతం చెత్త తరలించే ఆటోల స్థానంలో.... ఎలక్ట్రిక్, సీఎన్జీ టిప్పర్ ఆటోలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
ప్రమాద గంటికలు
ఇప్పటి వరకు నగరంలో చెత్తను తరలించేందుకు ఆటోలు, లారీలకు లక్షల రూపాయల డీజిల్ బిల్లులు అయ్యేవి. జీహెచ్ఎంసీలో ఉన్న ఆటోలు, లారీలు పాతకాలం నాటివి కావడం వల్ల వాటి నుంచి కాలుష్యం ఎక్కువ మోతాదులో వస్తోంది. నగరంలో కాలుష్యం ప్రమాద గంటికలు మోగిస్తోంది.
దశలవారిగా వాహనాలు..
ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాల వల్ల డీజిల్ బిల్లుల ఆదాతో పాటు.... కాలుష్యాన్ని కూడా తగ్గించినట్లు అవుతుందని బల్దియా అధికారులు చెబుతున్నారు. నూతనంగా తీసుకురానున్న సీఎన్జీ టిప్పర్ ఆటోలను నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్లు పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి 500 వాహనాల కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. ఇందులో 150 సీఎన్జీ ఆటోలతో పాటు... మరో 150 ఎలక్ట్రిక్ వాహనాలు జీహెచ్ఎంసీ కొనుగోలు చేయనుంది. వీటి నిర్వహణ పరిశీలించిన తర్వాత రానున్న రోజుల్లో... దశలవారీగా ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు తీసుకొస్తామంటోంది.
ఇవీ చూడండి: యాదాద్రి పేరు విశిష్టత ఇదే..!