Political Parties Focus on Rural Votes : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలెంది. దీంతో పార్టీలన్ని పట్టణాలు, గ్రామాలను చుట్టేస్తున్నాయి. ప్రచారంలో (Election Campaign) అధికభాగం పట్టణాల్లో జరుగుతున్నట్లు కనిపిస్తున్నా.. తెలంగాణ పాలన పగ్గాలను వచ్చే ఐదేళ్లు ఎవరికి అప్పగించాలనే విషయంలో పల్లెల తీర్పే కీలకంగా మారనుంది. ఎందుకంటే రాష్ట్రంలో 61 శాతం ప్రజలు పల్లెవాసులు కావడం ఒకటి కాగా.. తప్పకుండా అత్యధికులు ఓటేసేది వారే కావడం మరో అంశం. ఈ నేపథ్యంలో పార్టీలు గ్రామాల్లో పట్టు సాధించడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి.
పథకాల లబ్ధిదారులూ అత్యధికంగా వారే : గ్రామాల్లో ప్రజల ఆదాయాలు సాధారణంగా తక్కువగానే ఉంటాయి. ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం ప్రకృతిపై, మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సైతం గ్రామీణ ప్రాంతాల వారినే ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని అనేక పథకాలు తెచ్చింది. దళిత బంధు, పోడు పట్టాలు, గొర్రెల పంపిణీ, రైతు బంధు వంటి పథకాల్లో 80 శాతం లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల వారే. మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, బీసీబంధు, కేసీఆర్ కిట్లు, మన ఊరు-మనబడి, కంటి వెలుగు, కల్యాణలక్ష్మి,తదితర పథకాల్లోనూ లబ్ధి గ్రామీణ ప్రాంతాలకే ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు
గత రెండు ఎన్నికల్లో : 2014లో బీఆర్ఎస్‌కు (టీఆర్ఎస్) (BRS Election Campaign) వచ్చిన సీట్లలో 62 శాతం గ్రామీణ ప్రాంతాలవి కాగా.. 2018లో 69 శాతం అక్కడినుంచే వచ్చాయి. కాంగ్రెస్‌కు 2018లో వచ్చిన 19 సీట్లలో దాదాపు అన్నీ గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉన్నాయి. 2018 సాధారణ ఎన్నికల్లో బీజేపీది గెలిచిన గోషామహల్ నగరంలోనిది కాగా, ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో గెలిచిన దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలు గ్రామీణ నియోజకవర్గాలే.
పోలింగ్ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?
పల్లెల్లోనే ఓటింగ్ చైతన్యం : పల్లెల్లో ప్రతిఒక్కరిలో ఓటు వేయాలనే చైతన్యం ఉంది. 2014లో 25 గ్రామీణ నియోజకవర్గాల్లో 80 అంతకంటే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది.
గత ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం..
క్రమసంఖ్య | నియోజకవర్గం పేరు | ఓటింగ్ శాతం |
1 | మధిర | 91.65 |
2 | ఆలేరు | 91.33 |
3 | మునుగోడు | 91.07 |
4 | నర్సాపూర్ | 90.53 |
5 | భువనగిరి | 90.53 |
6 | నర్సంపేట | 90.06 |
గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం..
క్రమసంఖ్య | నియోజకవర్గం పేరు | ఓటింగ్ శాతం |
1 | చార్మినార్ | 40.18 |
2 | యాకుత్‌పుర | 41.24 |
3 | మలక్‌పేట | 42.74 |
4 | నాంపల్లి | 44.02 |
5 | జూబ్లీహిల్స్ | 45.61 |
6 | చాంద్రాయణగుట్ట | 46.11 |
7 | కంటోన్మెంట్ | 49.05 |
వారి దయ కోసం : గ్రామాల ప్రాధాన్యం తెలిసిన రాజకీయ పార్టీలు (Political Parties Election Campaign).. ఎన్నికలకు ముందు నుంచే అక్కడ ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. పార్టీల అభ్యర్థులు పల్లె బాట పట్టి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇండ్లలోని మహిళలను, వృద్ధులను, పొలాలకు వెళ్లి.. వరి కోతల్లో నిమగ్నమైన అన్నదాతలను, కూలీలను కలుస్తున్నారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలతో భేటీలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో తమ సమస్యలు పరిష్కరించని ప్రజాప్రతినిధులను ప్రజలు సైతం నిలదీస్తుండడం గమనార్హం.
ఇవీ ప్రచారాంశాలు : తమ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిపై బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కొత్తగా డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పంచాయతీలకు నెలవారీగా నిధులివ్వడం, పల్లె ప్రగతి, గ్రామీణ ఉపాధిహామీ, ఇతర పథకాల ద్వారా చేపట్టిన గ్రామీణ క్రీడా కేంద్రాలు, వైకుంఠధామాలు, రోడ్లు, మురుగు కాల్వలు, భవనాల నిర్మాణాల ఏర్పాటు తదితర అంశాలను వివరిస్తోంది. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాల లబ్ధిదారులను కలిసి ఓట్లు అడుగుతోంది. కొత్తగా డివిజన్లు, మండలాలపైనా నేతలు హామీలు ఇస్తున్నారు.
ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు
Political Parties Election Campaign in Telangana : పంచాయతీలకు కేంద్ర నిధులు, ఉపాధిహామీ పథకం నిర్వహణ, గ్రామీణ మహిళలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లపై సబ్సిడీ తదితర అంశాలను బీజేపీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలను తెలియజేస్తూ వాటి పరిష్కారంలో వైఫల్యాలను కాంగ్రెస్ నేతలు ఎండగడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే అన్నింటినీ నెరవేరుస్తామని చెబుతున్నారు. పల్లెటూర్లలో అభివృద్ధికి నిధుల కొరత, బిల్లుల విడుదలలో జాప్యంపై రెండు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.