Political Leaders on Roshaiah: దివంగత మాజీ ముఖ్యమంత్రి రోశయ్య.. చట్టసభల్లో పోషించిన పాత్ర అందరికీ స్పూర్తిదాయకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన గొప్ప పరిపాలనా అధ్యక్షుడన్న రేవంత్... ఈనాటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో మాజీ సీఎం రోశయ్య వైకుంఠ సమారాధన సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. రోశయ్య సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వీహెచ్, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏపీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సుబ్బిరామిరెడ్డి, జి.నిరంజన్, మాజీ మంత్రులు జానారెడ్డి, రఘువీరారెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, కేవీపీ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ట్రబుల్ షూటర్...
సమస్యల పరిష్కరించడంలో రోశయ్య ట్రౌబుల్ షూటర్ అని ప్రతి పక్షాలకు సింహస్వప్నమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్ఠానం తరపున తనను హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు చెప్పినట్లు రేవంత్ వివరించారు. పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్ల ఏఐసీసీ నుంచి ఎవరూ రాలేకపోయారని తెలిపారు. రోశయ్య ఆశయాలకు అనుగుణంగా... ఆయన స్పూర్తితో పని చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. రోశయ్యకు హైదరాబాద్ నడిబొడ్డున స్మృతివనం నిర్మించాలన్న రేవంత్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా సేవలందించిన వ్యక్తి రోశయ్య. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివాదరహితుడిగా ఉన్న అతి కొద్ది మందిలో రోశయ్య ఒకరు. ఆయనలేని లోటు ఎవరూ పూడ్చలేనిది.
-- రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
లోటు పూడ్చలేం...
రోశయ్యతో కలిసి పనిచేయడం అదృష్టమని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని మండలాలు తిరిగిన వ్యక్తి రోశయ్య అని... ఆయన లేని లోటు పూడ్చటం కష్టమని వ్యాఖ్యానించారు. రెండు ప్రభుత్వాలు... విశాల దృక్పథంతో ఆయన ఆశయాలు శాశ్వతంగా ఉండేట్లు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మండలాన్ని సందర్శించిన ఏకైక నాయకుడు రోశయ్య. నేడు రాజకీయాల్లో ఉన్నవారు ఒక్కసారి రోశయ్య ప్రసంగాలు వినండి. ఎంత ఆవేశమొచ్చినా... ఆయన ఎలా మాట్లాడారో మీకు అర్థమవుతుంది. రెండు ప్రభుత్వాలు ఒక ఆలోచన తీసుకుని రోశయ్య పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్ణయాలు తీసుకోవాలి.
-- రఘువీరారెడ్డి, మాజీ మంత్రి
సరళమైన భాషతో...
రోశయ్య ఏ పక్షంలో ఉన్నా... పార్టీ గెలుపునకు పనిచేసేవారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సరళమైన భాషతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని భట్టి పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ఆదర్శంగా స్ఫూర్తిగా పనిచేయాలని కోరారు.
పరిపాలనా దక్షుడిగా, మానవతావాదిగా, ప్రజాస్వామ్య వాదిగా... సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించడంలో ఆయన దిట్ట. రాజకీయ నాయకులకు, సామాన్యులకు సైతం ఆయన జీవితం ఆదర్శం. ఆయన జీవితం విలువతో కూడుకున్నది.
-- జానారెడ్డి, మాజీ మంత్రి
నిండు హృదయుడు...
రోశయ్య నిండు హృదయుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన ఏ పదవిలో ఉన్న ఆ పదవికి వన్నె తెచ్చేవారని కొనియాడారు. రాజకీయ విలువలున్న నాయకుడని గుర్తుచేసుకున్నారు.
ఇదీచూడండి: