PM Modi Hyderabad Tour Today : ప్రధాని రాష్ట్ర పర్యటన వేళ.. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని మోదీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో కొవిడ్ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పడు.. ముఖ్యమంత్రి వెళ్తానంటే వద్దన్ని చెప్పి ప్రొటోకాల్‌ను పాటించకుండా అవమానించింది ప్రధానేనని గుర్తుచేశారు. విభజన చట్టం ప్రకారం రైల్వే లైన్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇతర హామీల అమలుపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి ఇప్పటికే విజ్ఞాపనలు ఇచ్చినా... ఎలాంటి ప్రయోజనం లేదని... తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
"గతంలో కొవిడ్ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ వచ్చినప్పడు.. ముఖ్యమంత్రి వస్తానంటే వద్దని చెప్పి.. ప్రొటోకాల్‌ను పాటించకుండా ప్రధానమంత్రి అవమానించారు. విభజన చట్టం ప్రకారం రైల్వే లైన్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇతర హామీల అమలుపై ప్రధాని సమాధానం చెప్పాలి." -వినోద్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు.
తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమా? అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ సవాల్ విసిరారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా.. ఏదో సాకుతో ముఖ్యమంత్రి రావడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే.. ప్రధానితో ప్రత్యేక సన్మానం చేయిస్తామని తెలిపారు.
"అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా.. ఏదో సాకుతో ముఖ్యమంత్రి రావడం లేదు. పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే.. ప్రధానితో ప్రత్యేక సన్మానం చేయిస్తా." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.
రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం మేరకు తెలంగాణకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాకే ప్రధాని.. రాష్ట్రానికి రావాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. 30 ప్రశ్నలతో ప్రధానికి.. భట్టి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
విభజన హామీలు అమలుచేయని, సింగరేణి ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ పర్యటన వేళ అంబేడ్కర్ విగ్రహాల వద్ద నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన తెలుపుతామని తెలిపారు.
ఇవీ చదవండి: