పోలింగ్ కేంద్రం నమూనా ఇలా..
పురపాలక సంఘాల ఎన్నికల పోలింగ్ ఈనెల 22న జరగనుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజు ముందుగానే పోలింగ్ అధికారులు, సిబ్బంది కేంద్రాలకు చేరుకుంటారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎంల) సాయంతో ఓటు వేసేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ దశలో పోలింగ్ కేంద్రం, ఓటు వేసే విధానం, అక్కడి సిబ్బంది.. ఇలా వివిధ అంశాలపై ‘ఈనాడు’ అందిస్తున్న కథనం.
1 మొదటి పోలింగ్ అధికారి
ఓటర్ల జాబితా మార్కుడు కాపీకి ఇన్‌ఛార్జిగా ఉంటారు. ఓటర్లను గుర్తించి గుర్తింపు కార్డులు(ఐడీలు) చూసి ముందుకు పంపిస్తారు.
2 రెండో పోలింగ్ అధికారి
ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై చెరగని సిరా గుర్తు వేస్తారు.
3 మూడో పోలింగ్ అధికారి
బ్యాలెట్ పేపరు బండిల్‌కు ఇన్‌ఛార్జి. ఓటరుకు బ్యాలెట్ పేపరును ఇచ్చే ముందు పేపరు కౌంటర్ ఫాయిల్‌పై సంతకం తీసుకుంటారు.
4 నాలుగో పోలింగ్ అధికారి
బ్యాలెట్ పేపరుపై మార్కు చేసే బాణం గుర్తు రబ్బరు స్టాంపునకు ఇన్‌ఛార్జిగా ఉంటారు. ఓటరు నుంచి బ్యాలెట్ పేపరు తీసుకుని రెండుసార్లు.. తొలుత నిలువుగా, తర్వాత అడ్డంగా మడవాలి. ఆ తర్వాత మడత విప్పి దానిని ఓటు వేసేందుకు రబ్బరు స్టాంపుతో సహా ఓటరుకు ఇస్తారు.
5 పీవో (ప్రిసైడింగ్ అధికారి)
పోలింగ్ స్టేషన్ పూర్తిగా కనిపించేలా ఒకచోట కూర్చోవాలి. పోలింగ్ స్టేషన్ బాధ్యత ఈయనదే. ఎలాంటి సందేహాలున్నా ఆ స్టేషన్ పరిధిలో తీర్చుతారు.
6 పార్టీల ఏజెంట్లు
వివిధ పార్టీల ఏజెంట్లు వారికి కేటాయించిన స్థానంలో కూర్చుంటారు. వచ్చిన ఓటర్లను గమనిస్తారు.
ఒక మూలలో ఓటింగ్ కంపార్టుమెంట్ ఉంటుంది. మన ఓటు వేసేది ఎవరికీ కనిపించకుంటా ఏర్పాట్లు ఉంటాయి.
వీరు నేరుగా వెళ్లవచ్చు
గర్భిణులు, బాలింతలు, వయోవృద్ధులు క్యూ పద్ధతిలో నిలబడాల్సిన అవసరం లేదు. నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేసే వెసులుబాటు ఉంది.
ఇవి ఉంటే ఓటరు కార్డు లేకపోయినా ఓటేయొచ్చు
ఓటర్లు ఎపిక్ కార్డు లేకపోతే ప్రత్యామ్నాయంగా 18 రకాల ఫొటో గుర్తింపు కార్డులను చూపించి ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. అవేంటో చదవండి.

* ఆధార్ కార్డు, పాస్‌పోర్టు
* డ్రైవింగ్ లైసెన్సు
* రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల ఉద్యోగులకు జారీ చేసే ఫొటో సర్వీసు గుర్తింపు కార్డులు.
* ప్రభుత్వ రంగ బ్యాంకులు/టీఎస్‌కాబ్/డీసీసీబీలు/పోస్టాఫీసు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ పుస్తకాలు.
* పాన్ కార్డు, జాతీయ జనాభా రిజిస్టర్ పథకం కింద జారీ చేసిన స్మార్ట్ కార్డులు
* జాబ్ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డు
* పట్టాదారు పాసుపుస్తకాలు
* ఫొటో ఉన్న శారీరక అంగవైకల్య ధ్రువీకరణపత్రం.
* రేషన్ కార్డులు.
ఎడమ చేతి చూపుడు వేలు లేకపోతే
ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఎడమ చేతికి ఉన్న ఏదైనా వేలిపై సిరా గుర్తు పెట్టవచ్చు. ఎడమ చేయి లేకపోతే కుడి చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేయాలి. ఆ వేలూ లేకపోతే ఏదైనా ఇతర వేలుపై సిరా గుర్తు వేయాలి. ఒకవేళ రెండు చేతులకూ వేళ్లు లేకపోతే అతని ఎడమ లేదా కుడి చేతి చిట్టచివర(మోడు)పై సిరా గుర్తు పెట్టాలి.
ఏజెంట్లు ఇలా..
పోలింగ్ ఏజెంట్లు ఇలా వరుస క్రమంలోకూర్చోవాలి.

* రాష్ట్ర ఎన్నికల సంఘంతో రిజిస్టరు చేయబడి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్రాల పార్టీల ఏజెంట్లు.
* రిజర్వు సింబల్‌తో రిజిస్టర్డు పార్టీల ఏజెంట్లు
* రిజిస్టరు చేయబడి రిజర్వు సింబల్ లేని రిజిస్టర్డు పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు.
పోలింగ్ స్టేషన్ బయట
* ఏదైనా గ్రామ సిబ్బంది, రెవెన్యూ అధికారి, ప్రిసైడింగ్ అధికారి నియమించిన స్థానిక ఉద్యోగి సాధారణంగా పోలింగ్‌స్టేషన్ బయట ఉంటారు.
* వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
* వాహనాలతో ప్రవేశించడం లేదా గుంపులు/ర్యాలీలుగా రావడం నిషేధం.
* రాజకీయ పార్టీల ప్రతినిధులు వంద మీటర్ల తర్వాతే ఉండాలి.
దొంగ ఓటు వేస్తే ఫిర్యాదు
ఓటరు ఎవరైనా దొంగ ఓటు వేయడానికి వచ్చాడని గుర్తిస్తే ప్రిసైడింగ్ అధికారి రాతపూర్వక ఫిర్యాదుతోపాటు ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించాలి. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్నవారందరూ ఓటు వేయడానికి అర్హులే.

ఛాలెంజ్‌డ్ ఓటు
పోలింగ్ ఏజెంట్లు ఒక వ్యక్తి గుర్తింపు గురించి ప్రిసైడింగ్ అధికారి వద్ద ఛాలెంజ్ చేసే వీలుంది. ఇందుకుగాను ప్రతి ఛాలెంజ్‌కు అతను రూ.5 నగదు రూపంలో చెల్లించాలి. ఆ ఛాలెంజ్‌పై విచారణ చేయాలి. ఈ విచారణలో గ్రామ సహాయకుడు/క్యూలో ఉన్న ఇతర ఓటర్ల సహకారం తీసుకుంటారు.
టెండర్డ్ ఓటు ఇలా
ఎవరిదైనా ఓటు పోలింగ్ కేంద్రానికి వచ్చేసరికే వేసి ఉంటే.. ఆ ఓటరు గుర్తింపు కార్డు చూసి.. పీవో నిర్ధరించుకోవాలి. పీవో సంతృప్తి చెందితే.. నిజమైన ఓటరుగా నిర్ధరించుకుని అతని టెండర్డ్ బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేయడానికి అనుమతించాలి. వేసిన ఆ ఓటును పీవో తన వద్ద పెట్టుకోవాలి.
ఓటర్లకు సూచనలు ఇలా..

* పోలింగ్ కేంద్రంలోకి ఇష్టమొచ్చినట్లు వెళ్లొద్దు.
* పోలింగ్ కేంద్రంలో అధికారితో మినహా ఎవరితోనూ మాట్లాడకూడదు.
* బ్యాలెట్ పేపరు అధికారి మడిచి మళ్లీ మడత తీసి ఇచ్చి ఓటు వేయమంటారు. తిరిగి అదే పద్ధతిలో మడత పెట్టి బ్యాలెట్ బాక్సులో వేయాలి.
* పోలింగ్ కేంద్రంలోకి చరవాణి అనుమతించరు.
* ఓటు వేసేప్పుడు స్వీయ చిత్రాలు దిగడం నిషేధం.
* కేంద్రం నుంచి వంద మీటర్ల తర్వాతే ఫొటోలు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది.
ఏజెంట్లు ముందే వెళ్లాలి..
* పోలింగ్ రోజున ఒక గంట ముందుగా అధికారులు, సిబ్బంది పోలింగ్ స్టేషన్‌లో సిద్ధంగా ఉండాలి. అభ్యర్థుల తరఫున ఏజెంట్లు గంట ముందుగానే అక్కడికి చేరుకోవాలి.
* గదిలో ఒక మూలలో ఓటింగ్ కంపార్టుమెంట్ ఏర్పాటు చేయాలి.
* ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి, నలుగురు సిబ్బంది ఉంటారు.
వేర్వేరు వరుసలు..
* పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించేందుకు పురుషులు, మహిళ ఓటర్లకు వేర్వేరుగా వరుసలు ఉండాలి.
* ఒకరి వెంట మరొకరు ఒకేసారి ముగ్గురు లేదా నలుగురు ఓటర్లు ప్రవేశించేందుకు ఏర్పాట్లు ఉండాలి.
* ఇతర ఓటర్లు బయట వరుసలో నిలబడి వేచి ఉండాలి.
* వృద్ధులు, చంటి పిల్లలున్న స్త్రీలు ముందుగా వెళ్లేందుకు ప్రాధాన్యం ఉండాలి.
* పురుషులు, స్త్రీలు ఒకరి తర్వాత ఒకరు పోలింగ్ స్టేషన్‌లోనికి ప్రవేశించేందుకు అనుమతివ్వాలి.
* పురుషులు లేదా స్త్రీలు పోలింగ్ స్టేషన్ వెలుపల ఒకటి కంటే ఎక్కువ వరుసలో ఉండేందుకు వీల్లేదు.
ప్రత్యేక గుర్తు తప్పనిసరి
ఓటరుకు జారీ చేసే ముందు ప్రతి బ్యాలెట్ పేపరు, దాని కౌంటర్ ఫాయిల్ వెనుక ఎన్నికల సంఘం సూచించిన విధంగా ప్రత్యేక గుర్తు ఉన్న స్టాంపు వేయాలి. ఇందులో మున్సిపాలిటీ/నగరపాలకసంస్థ కోడ్ నంబరు, వార్డు నంబరు/సంబంధిత పోలింగ్ స్టేషన్ వరుస సంఖ్యను సూచించాలి. ప్రతి బ్యాలెట్ పేపరు వెనుక ప్రిసైడింగ్ అధికారి తన పూర్తి సంతకం చేయాలి.
పోలింగ్ కేంద్రంలోకి వీళ్లు వెళ్లొచ్చు.
* ఓటరు
* పోలింగ్ అధికారులు
* ప్రతి అభ్యర్థి, అతని ఎన్నికల ఏజెంట్, పోలింగ్ ఏజెంట్.
* రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన అధీకృత వ్యక్తులు.
* విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు.
* పోలీసు అధికారులూ అసాధారణ పరిస్థితులు తలెత్తితే ప్రిసైడింగ్ అధికారి నిర్దిష్ట అనుమతితోనే లోనికి రావాలి.
* ఓటరు ఎత్తుకునే చంటిబిడ్డలు
* అంధులు లేదా దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వ్యక్తి
* ప్రిసైడింగ్ అధికారి ఓటరు గుర్తించడానికి లేదా అతనికి సహాయం చేసేందుకు అనుమతించిన వ్యక్తులు.
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు