Nagol Jewellery Shop Firing Case Update : నాగోల్ స్నేహపురి కాలనీలోని మహదేవ్ నగల దుకాణంలో చోరీ కేసులో దొంగలను పట్టుకునేందుకు పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దోషులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు కిలోల బంగారం, దాదాపు రూ.2 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు ఇచ్చిన మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.
కాల్పుల ఘటనలో గాయపడిన ఇద్దరు వ్యక్తులను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరామర్శించారు. సుప్రజ ఆస్పత్రికి వెళ్లిన సీపీ.. వారికి జరుగుతున్న చికిత్సపై ఆరా తీశారు. కాల్పుల ఘటనపై వివరాలను బాధితులు కల్యాణ్ చౌదరి, సుఖ్‌దేవ్‌లను అడిగి తెలుసుకున్నారు. పక్కా రెక్కీ నిర్వహించి నిందితులు దోపిడీ చేశారన్న సీపీ మహేశ్ భగవత్... నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. నిందితులు మూడు రౌండ్ల కాల్పులు జరిపారని.. చోరీకి పాల్పడింది స్థానికులా లేక ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వాళ్లా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
"నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో మహదేవ్ జ్యువెల్లరీ దుకాణంలో కాల్పులు జరిగాయి. దుకాణ యజమాని కల్యాణ్‌తో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. సికింద్రాబాద్ లోని గణపతి జువెల్లర్స్ యజమాని రాజ్‌కుమార్, సహాయకుడు సుఖ్‌దేవ్ బంగారాన్ని హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటారు. నిన్న కూడా మహదేవ్ నగల దుకాణంలో బంగారం విక్రయించేందుకు వచ్చారు. ఆ సమయంలో నిందితులు కాల్పులు జరిపి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు".- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ
ఇవీ చదవండి: