రాజధానిలో రెండువేలకుపైగా కల్యాణ మండపాలున్నాయి. వీటిలోనే పెద్దఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. కరోనా ముప్పున్నా వందలాదిమంది పాల్గొంటూ మాస్కులు కూడా ధరించడం లేదు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కల్యాణ మండపాల యజమానులందరికీ నోటీసులు జారీ చేశారు. ఇక ఏ వేడుకైనా 200 మందికి మించకుండా చూడాలని పేర్కొన్నారు. అత్రికమిస్తే కేసు నమోదుకు నిర్ణయించారు. అవసరమైతే మండపాన్ని సీజ్ చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు కూడా ఇలాగే కఠిన ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంత్యక్రియల వేళా...
కొవిడ్‌తో పాటు ఇతర రోగాలతో నగరంలో నిత్యం అనేక మంది మృత్యువాత పడుతున్నారు. అంత్యక్రియల సమయంలో కొన్ని చోట్ల వందల మంది పాల్గొంటున్నారు. ఇదీ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. కొద్ది రోజుల కిందట కూకట్‌పల్లి ఏరియాలో ఇలాగే చాలా మంది కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో అంత్యక్రియల వేళ వందమంది మాత్రమే హాజరయ్యేలా చూడాలని పోలీసులు నిర్ణయించారు. దీన్ని అధిగమిస్తే కేసులు నమోదు చేస్తారు.
అలా గాంధీకా.. సరికాదు: ఈటల
మహారాష్ట్రతో ఎక్కువ సరిహద్దు ఉన్న తెలంగాణకు రాకపోకలు సాగించే వారి సంఖ్య లక్షల్లో ఉండటంతో ఇక్కడా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రిని బుధవారం మంత్రి సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో దాదాపు 14 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని, అవసరమైతే వాటినీ ఉపయోగించుకుంటామన్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల వారు కరోనా రోగి పరిస్థితి విషమించగానే చివరి క్షణంలో గాంధీకి పంపిస్తున్నారన్నారు. అలా చేయకుండా రోగికి అక్కడే మెరుగైన చికిత్స అందించాలన్నారు. టిమ్స్‌లో వెయ్యి మందికి వసతులున్నాయని, ప్రస్తుతం ఇక్కడ 450 మంది చికిత్స పొందుతున్నారన్నారు.
కార్లో వెళ్లినా మాస్కు తప్పనిసరి
మహా నగరంలో మాస్కులు ధరించకపోవడంతో కొవిడ్ విపరీతంగా వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. నగరంలో రోడ్లపైకి వస్తున్నవారిలో 50 శాతం మంది కూడా మాస్కులు ధరించడం లేదు. ఇకనుంచి ద్విచక్ర వాహన ప్రయాణికులతో పాటు కార్లలో ఒక్కరే ఉన్నా మాస్కు ధరించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. మాస్కు ధరించనివారికి రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో గత నాలుగైదు రోజుల్లోనే 4800 మందిపై, సైబరాబాద్‌లో 2200, రాచకొండ పరిధిలోలో 830 మందిపైనా ఈ కేసులు నమోదు చేశారు. రాచకొండ పోలీసులు సీసీ కెమెరాలతో సైతం మాస్కులు ధరించని వారిని గుర్తించి జరిమానా విధించే పని మొదలుపెట్టారు.
కఠిన చర్యలు
కమిషనరేట్ పరిధిలో మాస్కులు ధరించకుండా తిరిగే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కరోనా విజృంభణను నిరోధించాలంటే అందరూ మాస్కులు ధరించడమే మార్గం. అందుకే దీనిపైనే దృష్టి సారించాం. ఇప్పటికే వేలాదిమందిపై కేసులు నమోదు చేశాô. ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటాం.
-అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ
గుమిగూడొద్దు
జనం అనేక చోట్ల గుమిగూడటంతోనే వైరస్ విస్తరిస్తోంది. ఎక్కడా 200 మందికి మించి ఒక్క చోట చేరకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని సంఘాలు ఇతర సంస్థలకు హెచ్చరికలు జారీ చేశాం. మాస్కులు ధరించనివారిపై చర్యలకు ఉపక్రమించాం. కరోనా బాధితులకు ఎలాంటి తోడ్పాటు ఇవ్వాలన్నా మా కమిషనరేట్ సిద్ధంగా ఉంది.
-సజ్జనార్, సైబరాబాద్ సీపీ
హెచ్చరికలు జారీ
కరోనా వైరస్ ప్రధాన కారణాల్లో ఒకటి సామూహిక వేడుకల నిర్వహణ. దీన్ని నిరోధించేందుకు తప్పనిసరి చర్యలను వివరిస్తూ అన్ని కల్యాణ మండపాలకు హెచ్చరికలు జారీ చేశాం. కేసుల నమోదుకు ప్రత్యేకంగా కొందరికి బాధ్యతలు అప్పగించాం. మాస్కు ధరించకుండా రోడ్లపైకి వస్తే రూ.వెయ్యి జరిమానా తప్పదు.
-మహేశ్ భగవత్, సీపీ
ఇదీ చూడండి: రాష్ట్రంలో 8 వారాల్లో 25 రెట్లు పెరిగిన కరోనా కేసులు