Tension at Gollapudi TDP Office: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెల్లవారుజాము నుంచే పోలీసులు, అధికారులు మోహరించి స్థానిక టీడీపీ కార్యాలయాన్ని తొలగించారు. పార్టీ ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. బయట రోడ్డుకు ఆనుకుని కూర్చునే పసుపు రంగు బల్లలు సైతం అధికారులు తొలగించారు.
పార్టీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో బారికేడ్లు పెట్టి ఎవర్నీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న పలువురు పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. టీడీపీ కార్యాలయం తొలగింపు నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని ఆయన బయటకు రాకుండా చేశారు.
Police Remove Gollapudi TDP Office: గొల్లపూడిలో టీడీపీ కార్యాలయ స్థలం లీజుపై గత కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబసభ్యుల మధ్య వివాదం తలెత్తడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థల వివాదం పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు గత నెల 28న తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించుకునేలోపే పార్టీ కార్యాలయాన్ని అక్కడి నుంచి అధికారులు, పోలీసులు తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యమంత్రి కళ్లల్లో ఆనందం చూడటానికే పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ స్థలంలోనే పార్టీ కార్యాలయం కొనసాగుతోందని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే కార్యాలయం తొలగించారని ఆరోపించారు. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటలు గడవక ముందే కార్యాలయం తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం జరగకూడదనే దురుద్దేశంతోనే ఇదంతా చేశారని విమర్శించారు.
ఆలూరి చిన్నాకు గిఫ్ట్ డీడ్ స్థలాన్ని రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి తప్ప కలెక్టర్‌కు లేదని న్యాయవాది ధరణికోట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. లీజు గడువు ముగియకుండా పార్టీ కార్యాలయం తొలగింపు దారుణమన్నారు. ఫిర్యాదును పరిశీలించమని మాత్రమే కలెక్టర్ ఆదేశిస్తే.. గంటల వ్యవధిలోనే తొలగింపు ప్రక్రియ చేపట్టారన్న శ్రీనివాసరావు.. న్యాయస్థానంలోనే దీనిని ఎదుర్కొంటామని తెలిపారు.
ఇదీ జరిగింది: గొల్లపూడి వన్‌సెంటర్ రోడ్డులో ఆలూరి శేషారత్నం పేరుతో స్థలం ఉంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. స్థలాన్ని కుమారులైన హరికృష్ణ చౌదరి (చిన్నా), సుబ్బారావుకు ఆమె 2009లో గిఫ్ట్‌డీడ్ చేశారు. కుమారులు తనకు నెలవారీ నిర్వహణకు డబ్బులు ఇవ్వట్లేదని, తన బాగోగులు చూడట్లేదని కొన్నాళ్ల క్రితం ఆమె కలెక్టరును ఆశ్రయించారు. గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని విన్నవించారు.
అయితే ఆ స్థలంలో కొన్నేళ్లుగా టీడీపీ కార్యాలయం ఉంది. ఇంతలో గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలని ఇబ్రహీంపట్నం సబ్-రిజిస్ట్రార్‌కు సూచిస్తూ కలెక్టర్ డిల్లీరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విజయవాడ గ్రామీణ మండలం తహసీల్దారు సాయి శ్రీనివాస్ నాయక్, ఏసీపీ హనుమంతరావు, సీఐ ఉమర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు ప్రతిఘటించారు.
ఇవీ చదవండి: