చక్కటి స్వరంతో ట్రాఫిక్ నిబంధనలపై పాటలు పాడుతున్న ఈయన పేరు అంజపల్లి నాగమల్లు. ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఒక వైపు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే... మరో వైపు ట్రాఫిక్ నియమాలపై పాటలు పాడుతూ అవగాహన కల్పిస్తున్నారు. అతివేగం, నిబంధనలు పాటించకపోవడం, శిరస్త్రాణం ధరించకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్, కారు సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి అంశాలను గేయాల రూపంలో ఆలపిస్తూ వాహనదారుల్లో చైతన్యం నింపుతున్నారు.
పాటలు సీడీగా మార్పు
నాగమల్లుది సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల. నల్గొండలో డీఎడ్ చదువుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటన అతన్ని కదిలించింది. చేతబడి చేస్తుందనే నెపంతో ఓ గ్రామంలో గ్రామస్థులంతా కలిసి ఓ మహిళను చితి మంటల్లో వేసి నిప్పంటించారు. అప్పటి జిల్లా ఎస్పీ మహేష్భగవత్ ప్రజల్లో మూఢనమ్మకాలను రూపుమాపేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని అలాంటి కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారు. అనంతరం పోలీసు ఉద్యోగంలో చేరాక అమరవీరులకు సంబంధించిన పాటలు పాడి... వాటిని సీడీగా రూపొందించారు.
ప్రస్తుతం అమరవీరులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా నాగమల్లు పాటల సీడీనే అక్కడ వినబడుతుంది. ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తూనే వాహనదారుల్లో నిబంధనల పట్ల చైతన్యం తీసుకురావాలని భావించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎదురయ్యే పరిణామాలు, శిరస్త్రాణం ధరించకపోవడం, అతివేగం వల్ల ఇబ్బందులు వంటి వాటిపై రయ్యిరయ్యిమంటూ నడపొద్దూ అంటూ పాడిన పాట మంచి ఆదరణ పొందింది.
ఆపదలో ఉన్న వారికి సాయం
చైతన్య కార్యక్రమాలతో పాటు ఆపదలో ఉన్న వారిని నాగమల్లు ఆదుకుంటున్నారు. రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి స్వయంగా ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. అనంతరం వారిని తన వాహనంలో తరలించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అతని సేవలకు ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు... ఉత్తమ పోలీస్ అధికారి అవార్డు లభించింది. ప్రజలను చైతన్యవంతులను చేసే రాచకొండ పోలీస్ కళాబృందానికి నాగమల్లు నేతృత్వం వహిస్తుండడం విశేషం.
గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించి పోలీస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన సామాజిక స్పృహను చాటి చెబుతున్న నాగమల్లుకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రజలను తన పాటలతో చైతన్య వంతులను చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈయన తీరు ఆదర్శనీయం.
ఇదీ చూడండి : 'అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలి'