హైదరాబాద్‌లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు నిరసన చేపట్టారు. ఈవెంట్స్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే దిల్‌సుఖ్‌నగర్ నుంచి చైతన్యపురి వరకు అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ ఈవెంట్స్‌లో నాలుగు మీటర్ల లాంగ్ జంప్ నిర్వహించారని అభ్యర్థులు మండిపడ్డారు. తమకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించి.. పరిష్కరించాలని కోరారు.
రన్నింగ్‌లో అర్హత సాధించిన తమను మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు కోరారు. ఇదే విషయంపై ఎమ్మెల్యేలు, ఎంపీలను, వివిధ రాజకీయ నాయకులను కలిసినా.. సమస్య పరిష్కారం కాలేదని వారు వాపోయారు. తమ సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ నియోజకవర్గాల్లో వెయ్యి మంది చొప్పున నామినేషన్లు వేస్తామని వారు తెలిపారు.
"మొయిన్స్‌కు అవకాశం ఇవ్వండి. పార్టీలకతీతంగా అందరినీ కలిశాం. అందరికి వినతిపత్రాలు ఇచ్చాం. రన్నింగ్‌లో క్వాలిఫై అయిన వారికి మొయిన్స్‌కి అవకాశం ఇవ్వండి. మేము రన్నింగ్‌లో అర్హత సాధించాం. కానీ లాంగ్ జంప్‌లో క్వాలిఫై కాలేదు. ప్రభుత్వం స్పందించి మాకు మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం." - పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు
మరోవైపు రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీక్ష ఫలితాలపై పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇందుకోసం అప్పుడు ఉన్న హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 30 నుంచి వెబ్‌సైట్‌లో లాగిన్ అయి దేహదారుఢ్య పరీక్ష కోసం పార్ట్-2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని పోలీసు నియామక బోర్డు తెలిపింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8 గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు పార్ట్-2 అప్లికేషన్ సమర్పించేందుకు అవకాశం కల్పించారు.
ఇవీ చదవండి: ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై కీలక నిర్ణయం
గ్రూప్ 4 దరఖాస్తుల గడువు పొడిగించిన టీఎస్‌పీఎస్‌సీ
'పఠాన్' కోసం పక్క రాష్ట్రానికి దివ్యాంగుడు.. సోదరుడి భుజంపై ఎక్కి 150కి.మీ ప్రయాణం
'లౌకిక విలువలు కాపాడటమే యాత్ర లక్ష్యం.. RSS భావజాలంతో దేశానికి నష్టం'