Police Impose Election Code Strictly in Telangana : శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు రూ.75 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణాలు(Gold Jewellery), మద్యం, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.48.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. అందులో నిన్న ఒక్క రోజే రూ.21 కోట్లకు పైగా పట్టుబడింది. రూ.21 కోట్లలో ఆదాయపు పన్ను శాఖ రూ.15.51 కోట్ల నగదు స్వాధీనం చేసుకొంది.
ఇప్పటి వరకు రూ.17.50 కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలు పట్టుబడ్డాయి. లక్షా 33 వేల లీటర్లకు పైగా మద్యం పట్టుబడగా... దాని విలువ రూ.4 కోట్లకు పైగా ఉంది. రూ.2.48 కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.1.90 కోట్లకు పైగా విలువైన ఇతర వస్తువులైన.. కుట్టు మిషన్లు(Sewing Machines), బియ్యం, కుక్కర్లు, చీరలు, గడియారాలు, హెల్మెట్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న మొత్తంలో నిన్న ఒక్క రోజే రూ. 25 కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం, బంగారు, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి.
Police Seized Rs 50 Lakh in Medak : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడం, ఎన్నికల సమయం దగ్గర పడడంతో మేడ్చల్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగర శివార్లలోని జరిగిన వివిధ 5 తనిఖీలలో, సుమారు రూ.50 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
1) మేడ్చల్ వివేకానంద విగ్రహం వద్ద మెదక్ జిల్లాకు చెందిన నాగేందర్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర రూ.35 లక్షలు.
2) కిష్టాపూర్ వద్ద మరో వ్యాపారవేత్త నరసింహారెడ్డి నుంచి రూ.13 లక్షలు.
3)మేడ్చల్ వివేకానంద విగ్రహం వద్ద ఒక అతని దగ్గర రూ.5.68 లక్షలు
4) మరో వ్యక్తి వద్ద 18 తులాల బంగారం.
5) మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో(Vehicle Checking) రూ.62900 పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం స్క్రీనింగ్ కమిటీ ముందు డబ్బులను ప్రవేశపెట్టడం జరుగుతుందని సీఐ నరసింహ రెడ్డి చెప్పారు. డబ్బులు తరలించిన వ్యక్తులు సరైన ధ్రువపత్రాలను చూపిస్తే నగదును ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ పరిశీలన అనంతరం తిరిగి అప్పగిస్తామని అన్నారు.
EC Focus on Digital Payments : ఎన్నికల తాయిలాలు, నగదు పంపిణీతోపాటు ఇతర ప్రలోభాలపై ఎన్నికల సంఘం నిఘా తీవ్రతరం చేసింది. అంతేకాదు.. ఆన్లైన్లో అడ్డగోలుగా జరిగే నగదు లావాదేవీలపై పటిష్ఠ కట్టడి చర్యల్లో దూకుడు పెంచింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు రెట్టింపయ్యాయనే చెప్పవచ్చు. అతిసులువైన మార్గంలో మనీ తరలించడంలో డిజిటల్ హవా ఎక్కువ, కాబట్టి ఆన్లైన్ లావాదేవీలపై దృష్టిసారించింది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అనూహ్య నగదు బదిలీలు(Money Transfer), పరిమితికి మించి సొమ్ము జమ, విత్‌డ్రాలపై పూర్తిస్థాయిలో ఈసీ ఫోకస్ పెట్టనుంది.