Police File a petition for taking accused Harihara into Custody: హైదరాబాద్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బీటెక్ విద్యార్థి నవీన్ దారుణహత్యలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడైన హరిహరకృష్ణ లొంగిపోయినా.. పోలీసులు బలమైన ఆధారాల వేటలో ఉన్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు, నిందతుడి నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ఇంకా దొరకని సెల్‌ఫోన్: నవీన్ హత్యకు సంబంధించి నేరం జరిగిన ప్రాంతాన్ని సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు మరోసారి నిందితుడితో కలిసి పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ఈ హత్య వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని అంబర్ పేట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. నవీన్ చరవాణిని ధ్వంసం చేసిన హరిహర.. దాన్ని బాహ్యవలయ రహదారి పక్కన ఉన్న పొదల్లో పడేశాడని.. అది ఎక్కడ పడేశాడనేది తెలుసుకోవాల్సి ఉందని వారు తెలిపారు. నిందితుడి సెల్ ఫోన్‌ను సైతం స్వాధీనం చేసుకోవాలని, అతను దాన్ని ఎక్కడ దాచాడనే విషయాన్నీ అడిగి తెలుసుకోవాలని అందులో వివరించారు. రేపు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
హసన్‌ను ప్రశ్నించిన పోలీసులు: నవీన్‌ను హత్య చేసిన తర్వాత నేరుగా బ్రాహ్మణపల్లిలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లినట్లు నిందితుడు పోలీసులకు చెప్పడంతో... అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అతడ్ని పిలిచి ప్రశ్నించారు. ఘటన జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల గురించి హసన్‌ను అడిగి తెలుసుకున్నారు. తన ఇంటికి హరిహర కృష్ణ వచ్చాడని, దుస్తులపై రక్తపు మరకల గురించి అడగ్గా.. నవీన్‌ను హత్య చేసినట్లు చెప్పినట్లు హసన్ తెలిపాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించగా... తన ప్రేమకు అడ్డు రావడంతోనే హత్య చేసినట్లు చెప్పాడని పోలీసులకు వివరించాడు. ఫిబ్రవరి 25వ తేదీన అనుమానంతో హసన్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించిన పోలీసులు.. ఆ తర్వాత ఈ హత్యతో అతనికెలాంటి సంబంధం లేదని తేల్చి ఇంటికి పంపించేశారు.
హరిహర కృష్ణ, హసన్ ఇంటర్మీడియెట్ లో స్నేహితులు. గతంలో అతను ఎప్పుడూ నేరాలకు పాల్పడలేదని హసన్ పోలీసులకు చెప్పాడు. తన ప్రేమకు అడ్డు వస్తున్నాడని హరిహరకృష్ణ అతని స్నేహితుడినే ఫిబ్రవరి 17న కిరాతకంగా చంపి, నగర శివారులోని ఔటర్ రింగు రోడ్డు వద్ద పొదల్లో పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.
ఇవీ చదవండి: