శాంతిభద్రతల పర్యవేక్షణలో తలమునకలయ్యే పోలీసులు... ప్రజామిత్ర పోలీసింగ్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ప్రజలతో సఖ్యతగా మెలగాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నా... కిందిస్థాయి సిబ్బంది మాత్రం పెడచెవిన పెడుతున్నారు. ఫిర్యాదుదారులు, ఆందోళనకారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు.
అనుచితంగా ప్రవర్తిస్తూ!...
చార్మినార్‌లోని యునానీ ఆసుపత్రి నుంచి ఆయుర్వేద ఆసుపత్రిని తరలించడాన్ని నిరసిస్తూ.. వైద్యులు చేపట్టిన ఆందోళనలో ఓ ఖాకీ.. యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆందోళన చేస్తున్న వైద్యురాలిని కాలితో తొక్కి... చెయ్యిని గిల్లాడు.
అనిశాకు చిక్కుతున్నారు!:
పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి బయటపడుతున్న ఘటనలు కొన్నైతే... మరికొన్ని వెలుగులోకి రావడం లేదు. ఓ కేసులో భర్తకు బెయిల్ వచ్చే విధంగా చేయడానికి భార్య నుంచి 20వేలు లంచం తీసుకుంటూ.. ఎస్సై అనిశాకు పట్టుబడ్డాడు. బైండోవర్ కేసులో ఫిర్యాదుదారుడి సాయం చేసేందుకు 30వేలు లంచం తీసుకుంటూ మొఘలపుర ఎస్సై బాలు అనిశాకు పట్టుబడ్డాడు.
హయత్‌నగర్‌లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి... ఓ కేసులో ఫిర్యాదుదారుడి నుంచి 30వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన వ్యాపారిని కేసు నుంచి తప్పించేందుకు 80వేలు లంచం తీసుకుంటూ మహేశ్వరం ఎస్సై నర్సింహ్ములు దొరికిపోయారు. రహదారి ప్రమాదంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ద్విచక్రవాహనదారుడి నుంచి 2వేలు లంచం తీసుకుంటూ రాయదుర్గం ఎస్సై శశిధర్ అనిశాకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
మాములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు!
లంచాలు తీసుకోవడమే కాకుండా.. వ్యాపారులు, మద్యం దుకాణాలు, పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, హుక్కా కేంద్రాల నుంచి నెలవారి మాములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి 12 గంటలు దాటినా... పలు దుకాణాలు తెరుచుకొనే ఉంటున్నాయి. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం వల్లే వ్యాపారులు అర్ధరాత్రి దాటినా వ్యాపారం కొనసాగిస్తున్నారు.
నిందితులతో కలిసి లావాదేవీలు!
మద్యం దుకాణాల దగ్గరికి వెళ్లి మద్యం సీసాలు, హోటళ్ల దగ్గర బిర్యానీలను పోలీసులు తెచ్చుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మద్యం దుకాణంలో మద్యం సీసాలను తీసుకొచ్చి పోలీసులు తమ వాహనంలో పెట్టుకొని వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నేరస్థులతో పోలీసు అధికారులు అంటకాగుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవాస భారతీయుడు జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డితో ఏసీపీ, ఇద్దరు సీఐలు లావాదేవీలు నిర్వహించినట్లు తేలడంతో ఉన్నతాధికారులు వాళ్లను సస్పెండ్ చేశారు.
మార్పు అవసరం:
గీత దాటుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా... కొంత మంది ఖాకీల్లో మాత్రం మార్పు రావడం లేదు. పోలీస్ శాఖను ప్రజామిత్ర శాఖగా మార్చేందుకు పోలీసు బాస్ ప్రయత్నిస్తున్నా.... కిందిస్థాయి సిబ్బందిలో మార్పు వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది.
ఇదీ చుడండి:- సిద్ధార్థ సేవలు కొనియాడిన పారిశ్రామిక దిగ్గజాలు