హైదరాబాద్ ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన విపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డిని అరెస్టు చేసి.. చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా, జూలకంటి రంగారెడ్డితో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముట్టడి యత్నానికి నారాయణ పీపీఈ కిట్‌ను ధరించి వచ్చారు.
ప్రగతి భవన్ ముట్టడికి బయల్దేరిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణను అడ్డుకున్న పోలీసులు... కొద్దిసేపు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అదుపులోకి తీసుకొని నారాయణ గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అలాగే తెలుగుదేశం గ్రేటర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెజస అధ్యక్షుడు కోదండరాంను కూడా అరెస్టు చేశారు. వీరితోపాటు ప్రగతిభవన్ ముందు న్యూ డెమోక్రసీ నేతలు గోవర్ధన్, సంధ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరోనా కట్టడి చర్యలు మరింత పగడ్బందిగా చేపట్టి.. ప్రజల ప్రాణాలను కాపాడాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. శ్వేత సౌధం ముందు నల్లజాతీయులకు నిరసన తెలిపే అవకాశం ఉందని... తెలంగాణ కోసం కొట్లాడిన వారికి మాత్రం ప్రగతిభవన్ ముందు నిరసన తెలిపే అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తే కేసీఆర్ పోలీస్ ఎమర్జెన్సీ విధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణ పెట్టాల్సిన ప్రభుత్వం ఆందోళనలను అణిచి వేస్తోందన్నారు. పోలీసులతో ఉద్యమాలను అణిచివేయడం దారుణమని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా అని చాడ ప్రశ్నించారు. అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.