Teleconference on Assembly Sessions: మరో రెండు రోజుల్లో శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంయుక్తంగా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశంలోనే ఆదర్శంగా ఉందని పోచారం పేర్కొన్నారు. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని అన్నారు. స్పీకర్, సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు స్పష్టం చేశారు. గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్‌లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని కోరిన ఆయన.. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందించాలన్నారు. సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని.. ప్రతి శాఖ తరఫున ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు.
ప్రొటోకాల్ తప్పనిసరి..: ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని.. శాసనసభ కమిటీలకు అవసరమైన సమాచారాన్ని ప్రభుత్వం తరఫున అందించాలని పోచారం పేర్కొన్నారు. అసెంబ్లీ డిస్పెన్సరీలో కరోనా టెస్టింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయటంతో పాటు.. అవసరమైన సభ్యులకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ, మండలి పరిసరాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహాచార్యులు, సీఎస్ సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్, అగ్నిమాపక సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
కీలక ప్రకటనలకు అవకాశం..: ఈ నెల 6 నుంచి శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయసభల సమావేశాలు ప్రారంభమవుతాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ సమావేశాల్లో కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలు, ఇటీవల వరదలపై సభలో చర్చ జరిగే అవకాశముంది. బడ్జెట్ సమావేశాలు మార్చి 15న ముగిశాయి. దీంతో సెప్టెంబర్ 14వ తేదీలోపు సభ మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి తేదీలు ఖరారు చేశారు.
ఇవీ చూడండి..
Assembly sessions: ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
'కాంగ్రెస్ మా రక్తంతో తయారైంది.. వారు మాత్రం ట్వీట్లకే పరిమితం.. అందుకే ఇలా..'