PM Modi Telangana Tour in July : ప్రధాని నరేంద్ర మోదీ జులై 12న తెలంగాణకు వచ్చే అవకాశముందని బీజేపీవర్గాలు పేర్కొన్నాయి. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్‌ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెలాఖరులోపు ప్రధాన మంత్రి రాష్ట్రానికి రావాల్సి ఉండగా కార్యక్రమం వాయిదా పడిందని చెప్పారు. ఈ క్రమంలోనే జులై 12న వస్తారని పార్టీ ముఖ్య నాయకులు వివరించారు. అదే రోజు వరంగల్‌లో సభ నిర్వహించేందుకు చర్చిస్తున్నామని.. రెండు రోజుల్లో ప్రధాని పర్యటన ఖరారు అవుతుందని నేతలు వెల్లడించారు.
జులై 8న బీజేపీ నాయకుల కీలక సమావేశం : మరోవైపు జులై 8న హైదరాబాద్ వేదికగా.. ఏకంగా 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో ఈ ఏడాదే శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ కీలక సమావేశం పార్టీపై సానుకూల ప్రభావం చూపుతుందని భారతీయ జనతా పార్టీ నాయకత్వం భావిస్తోంది. అందుకే వివిధ రాష్ట్రాల పార్టీ బాధ్యులతో కీలక భేటీకి హైదరాబాద్‌ను వేదిక చేసుకున్నట్లు సమాచారం.
నేడు 600 మంది ఇతర రాష్ట్రాల కార్యకర్తలు : బుధవారం వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది బీజేపీ బూత్ కమిటీ సభ్యులు రాష్ట్రానికి రానున్నారు. భోపాల్‌లో మంగళవారం జరిగిన ‘మేరా పోలింగ్ బూత్... సబ్‌సే మజ్బూత్’ కార్యక్రమంలో పాల్గొన్న వీరు ప్రత్యేక రైలులో తెలంగాణకు చేరుకుంటారు. మంచిర్యాల, కాజీపేట, సికింద్రాబాద్‌లలో మూడు బృందాలుగా విడిపోతారు. వీరంతా జులై 5 వరకు రాష్ట్రంలోనే ఉండనున్నారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వివిధ కార్యక్రమాలు చేపడతారు. భోపాల్‌లో ప్రధాని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి వీరిని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయజెండా రెపరెపలాడాలని దిల్లీలో కమలం నాయకులు వ్యూహరచన సిద్ధం చేస్తున్నారు. కర్ణాటకలో ఓటమి అనంతరం.. పార్టీ క్యాడర్ నిరాశకు లోనుకాకుండా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా వ్యూహాలను అమలుచేస్తోంది.
Telangana Elections 2023 : ఈ మేరకు ప్రణాళికబద్ధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు రోజుల క్రితమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. మరోవైపు ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కానీ బిపోర్ జాయ్ తుపాను కారణంగా షా పర్యటన రద్దైంది. ఈ క్రమంలో ఖమ్మంలో తలపెట్టిన బహిరంగ సభను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి :