PM Modi AP Tour Today Live News : నేడు ప్రధాని మోదీ ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నాసిన్ (National Academy of Customs, Indirect Taxes and Narcotics)ను ప్రారంభించనున్నారు. నాసిన్ ప్రారంభోత్సవాని కంటే ముందు ప్రధాని మోదీ లేపాక్షి ఆలయాన్ని సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
PM Modi Visits Sathya Sai District Today : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్) ను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ వద్ద ప్రారంభానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
PM Modi To Inaugurate NACIN Centre : ప్రధాని మోదీ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగుళూరు విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి లేపాక్షికి హెలికాప్టర్లో చేరుకోనున్నారు. ప్రఖ్యాత లేపాక్షి ఆలయాన్ని, శిల్పకళా సంపదను మధ్యాహ్నం 2 గంటలకు మోదీ సందర్శించనున్నారు. ఇందుకోసం లేపాక్షి ఆలయానికి సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయ సందర్శన అనంతరం హెలికాప్టర్లో నాసిన్ ప్రాంగణంలోకి చేరుకోనున్నారు.
ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్ లో శిక్షణ: సీఎం జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా నాసిన్‌కు చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌లు హాజరుకానున్నారు. నాసిన్‌లో సభావేదిక ఏర్పాటు చేశారు. ఐఆర్ఎస్, కస్టమ్స్ అధికారులకు నాసిన్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వటానికే ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మధ్యాహ్నం మూడు- సాయంత్రం ఐదు గంటల మధ్య నాసిన్ ప్రారంభోత్సవం జరుగుతుందని అధికారులు తెలిపారు.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ప్రధాని కార్యాలయం: మోదీ ఏపీ పర్యటన కోసం ప్రధాని కార్యాలయం ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం ప్రధాని పర్యటన షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటుగా, శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పంపారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా మీడియాకు అనుమతి లేకుండా చేశారు. ఇప్పటికే నాసిన్ వెలుపల రాష్ట్ర పోలీసులతో భారీగా భత్రత ఏర్పాట్లు చేశారు. నాసిన్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ రక్షణ దళాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.