అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టులో మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌పై కోర్టు ధిక్కార చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలైంది. అయోధ్యలో 'భూమి పూజ' కార్యక్రమానికి ముందు ఓ జాతీయ మీడియాలో సుప్రీంకోర్టు వైఖరిని తప్పుబడుతూ ఓవైసీ ప్రకటన చేయడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఇండియా అధ్యక్షుడు వీరేశ్ షాండిల్య సహా ఓ న్యాయవాది అసద్‌పై కోర్టు చర్యలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతున్నారు...
రామ మందిరం వివాదంపై సుప్రీం తీర్పు ప్రకటించిన అనంతరం కోట్లాది మంది హిందువుల మనోభావాలు, విశ్వాసాన్ని ఏ మాత్రం లెక్కచేయకుండా నిరాధారమైన ప్రకటనలు గుప్పించారంటూ పిటిషన్లో పేర్కొన్నట్లు వీరేశ్ పేర్కొన్నారు. అలాంటి కవ్వింపు మాటలతో ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని తెలిపారు.
మనోభావాలను దెబ్బతీశారు...
జూలై 30న ఓవైసీ చేసిన ప్రకటన రాముడి మీద విశ్వాసం ఉన్న కోట్లాది హిందూవుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని పిటిషన్లో వివరించారు. జాతీయ ఛానల్లో ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా భారత అత్యున్నత న్యాయస్థానాన్ని అగౌరవ పరిచేందుకు యత్నించినట్లు స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం ధర్మాసనాన్ని అభ్యర్థించారు.