కొవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్లాస్మా థెరపీ సత్ఫలితాలిస్తోంది. ప్రాణాపాయస్థితిలో ఉన్న బాధితునికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించడం వల్ల కోలుకుంటున్నాడు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) ఆదేశాలతో దాతల నుంచి సేకరించిన ప్లాస్మాను గాంధీ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్‌లో మైనస్ 18 డిగ్రీల సెల్సియస్ ఫ్రీజర్ బాక్సుల్లో భద్రపరిచారు .
సుమారు 16 మంది కరోనా బాధితులు ఆక్సిజన్‌పై ఉండగా వారిలో ఆరుగురిని ప్లాస్మా థెరపీ కోసం ఎంపిక చేసి ఐసీఎంఆర్‌కు పంపారు . అక్కడి ఆదేశాలతో ప్లాస్మా థెరపీని ప్రారంభించారు . పాతబస్తీకి చెందిన• ఒకే బాధితునికి రెండు సార్లు ప్లాస్మాను ఎక్కించారు. ఐసీఎంఆర్ నిబంధన ప్రకారం .. ప్లాస్మా ఎక్కించిన తర్వాత బాధితుడు కోలుకుంటున్న క్రమంలో రెండో డోస్ ఎక్కించాలి. మొదటి డోస్ ప్లాస్మా ఎక్కించినా పురోగతి లేకుంటే ఈ రకమైన చికిత్స ఎటువంటి ప్రభావం చూపట్లేదని భావించి రెండో డోస్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో బాధితుడు కోలుకుంటున్న క్రమంలోనే రెండో డోస్ ప్లాస్మా ఎక్కించినట్లు తెలిసింది. మరో రెండు రోజుల్లో సదరు బాధితుడు సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జయ్యే అవకాశం ఉంది .
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా బాధితులకు సరిపడే ప్లాస్మా అందుబాటులో ఉంది. ఐసీఎంఆర్ ఆదేశాలతో మిగిలిన వారికి సోమవారం నుంచి ప్లాస్మా థెరపీ ప్రారంభించే అవకాశం ఉందని ఓ వైద్యుడు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు దాతల నుంచి ప్లాస్మా సేకరించామని ఆస్పత్రి పాలన యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది.
ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు