గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. ఐదుగురు కరోనా బాధితుల్లో ప్లాస్మా థెరపీని ప్రయోగాత్మకంగా అందించగా అందరూ కోలుకోవడం విశేషం. రోగుల రక్తంలో ఆక్సిజన్ స్థాయి 84 నుంచి 90 శాతానికి పడిపోతున్న పరిస్థితుల్లో అతి క్లిష్ట స్థితిగా భావించి గాంధీ వైద్యనిపుణులు ఈ చికిత్సను ప్రారంభించారు.
ఒక రోగి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా... ముగ్గురు ఎక్కువ సమయం ఆక్సిజన్ అవసరం లేకుండా ఉండగలుగుతున్నారు. మరొకరికి అప్పుడప్పుడూ ప్రాణవాయు సేవలు అవసరమవుతున్నాయని గాంధీ వైద్యులు తెలిపారు.
ఐదుగురు కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తులకు ప్లాస్మాను అందించేందుకు కరోనాను జయించిన ఐదుగురు ముందుకొచ్చారు. సేకరించిన రక్తం నుంచి ప్లాస్మాను విడగొట్టి బాధితులకు చికిత్స అందించారు. థెరపీ పూర్తయ్యాక రోగుల ఆరోగ్యం గణనీయంగా మెరుగైందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: స్పీడు పెంచిన కరోనా- పక్షంలోనే లక్ష కేసులు