కొవిడ్ బాధితులకు సకాలంలో ప్రాణ వాయువు అందక కన్నుమూసిన ఘటనలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్ ఆర్ఎంఓ వెంకట్రావు వినూత్న ఆలోచన చేశారు. ఆక్సిజన్ నిల్వలు తక్కువ స్థాయి అవసరం ఉన్న వారికి, ఒకే సమయంలో ఎక్కువ మందికి ప్రాణ వాయువు అందించాలని అందుకు కాపర్‌తో " టీ " ఆకృతి పైపులు తయారు చేయించారు.
డాక్టర్ యశ్వంత్ విధానం అమలు..
విజయ నగరం కేంద్ర ఆస్పత్రిలో డాక్టర్ యశ్వంత్ అమలు చేసిన విధానాన్ని పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రిలోనూ ప్రయత్నిస్తే కొంతైనా కొరత తీరుతుందని భావించామని వెంకట్రావు వెల్లడించారు. ఒకే పాయింట్ నుంచి ఒకే సమయంలో ఇద్దరికీ ప్రాణ వాయువు అందేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఒక ఫ్లో మీటర్ నుంచి వచ్చే ఆక్సిజన్ పైపునకు త్రివేణి మెటల్ ఫేస్ పరికరాన్ని అమర్చారు. అది ఆక్సిజన్‌ను వేరు చేసి రెండు వైపులకు పంపిస్తుంది.
ఇక నుంచి ఇద్దరికీ ఆక్సిజన్..
ఇప్పటి వరకు ఒకే పైపు నుంచి మాత్రమే అందించే వీలు ఉండేది. ఇప్పుడు కాపర్ " టీ " ఆకృతి పైపుల నుంచి ఒకేసారి ఇద్దరికీ ప్రాణవాయువు అందిస్తున్న విధానాన్ని మరింత విస్తరించనున్నట్లు డాక్టర్ వెంకట్రావు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత