దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్న పీజీ సీట్లలో 50 శాతాన్ని అఖిల భారత కోటా పరిధిలోకి స్వీకరించి, ఇందులో అన్ని రాష్ట్రాల విద్యార్థులకూ నీట్ ర్యాంకుల ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తోంది. సాధారణంగా మార్చి చివరి వారంలో ఈ ప్రక్రియను ప్రారంభించి, రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాల్లేవని భావించారు. తాజాగా వెలువడిన మార్గదర్శకాల ప్రకటనతో ఒక్కసారిగా విద్యార్థుల్లో అప్రమత్తత నెలకొంది.
రాష్ట్రంలో ప్రవేశాలపై సందిగ్ధం
ఒకపక్క కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండడం.. ఈ నెలాఖరు వరకూ పొడిగించే అవకాశాలుండడం వల్ల పీజీ వైద్యవిద్య ప్రవేశాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అఖిల భారత కోటా తొలి విడత ప్రవేశాలు పూర్తయ్యాక రాష్ట్రంలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే రాష్ట్రంలో ప్రవేశ ప్రకటనే వెలువడలేదు.
దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన జరగాలి. తర్వాత తొలివిడత కేటాయింపు జాబితాను విడుదల చేయాలి. ఇందుకు నాలుగు వారాలైనా పడుతుంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంపై కఠిన నిర్ణయాలు అమలవుతున్న నేపథ్యంలో ఇక్కడ పీజీ వైద్యవిద్య ప్రవేశాలను ఎప్పుడు నిర్ణయించాలనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి.
మార్గదర్శకాలు
- తొలివిడత కేటాయింపు జాబితాను ఏప్రిల్ 10న విడుదల చేస్తారు.
- కేటాయించిన కోర్సు, కళాశాలల్లో అభ్యర్థులు చేరడానికి ఏప్రిల్ 20 వరకూ తుది గడువు.
- విద్యార్థులు సంబంధిత కళాశాలకు నేరుగా వెళ్లి, అవసరమైన ధ్రువపత్రాలు ఇచ్చి, రుసుమును చెల్లించి చేరిపోవచ్చు.
- నేరుగా కళాశాలకు వెళ్లడానికి వీలుపడని అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ప్రవేశ ప్రక్రియను కొనసాగించవచ్చు.
- కేటాయించిన కళాశాల అధికారిక వెబ్‌సైట్‌కు ఆన్‌లైన్‌లో తమ చేరిక ఆమోదాన్ని తెలుపుతూ మెయిల్ చేయాలి.
- అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను అప్‌లోడ్ చేయాలి.
- నిర్దేశిత రుసుమును కళాశాల అకౌంట్‌లో ఆన్‌లైన్‌లో జమ చేయాలి.
- రుసుమును జమ చేయడానికి ముందు.. ఆ కళాశాలకు ఫోన్ చేసి, అవసరమైన సమాచారాన్ని తెలుసుకొని, వారి అకౌంట్ నంబరు అధికారికమైనదే అని ధ్రువీకరించుకున్న తర్వాతే రుసుమును చెల్లించాలి.
- తాము సమర్పించే సమాచారంలో ఎలాంటి తప్పులున్నా.. సీటు రద్దు చేయడానికి అన్ని అధికారాలూ నిర్వహణ సంస్థకు ఉన్నాయనే నిబంధనకు అంగీకరిస్తూ ముందస్తు హామీ పత్రాన్ని జత పరచాలి.
ఇదీ చూడండి : చేతికొచ్చిన పంట.. నీటి పాలు!