కరోనాకు సబంధించి హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడుకొనేందుకు అవసరమైన ఔషధాల ధరలను నియంత్రించాలంటూ హైకోర్టు న్యాయవాది రామారావు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. కరోనాను నివారించే ఔషధాల ధరలను ప్రజలు భరించలేక ప్రాణాలను కోల్పోతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కరోనా ఔషధాల ధర నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండదని న్యాయవాది తెలిపారు.
ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. ధరల నియంత్రణకు సంభందించిన అధికారం జాతీయ ఔషధ ధర నియంత్రణ సంస్థకు ఉందని తెలిపారు. కరోనా బాధితులకు అందించే ఔషధ ధరలను నియంత్రించి, అత్యవసర ఔషధ జాబితాలో చేర్చాలని కోరారు. దేశంలో 12 ప్రభుత్వరంగ పరిశోధనశాలలు ఉన్నప్పటికీ... ప్రభుత్వేతర ప్రైవేటు సంస్థలు అయిన భారత్ బయోటెక్ ఇనిస్టిట్యూట్, సిరం ఇనిస్టిట్యూట్లకు ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.
దేశ అవసరాలకు సరిపడ వ్యాక్సిన్ ఉంచుకున్న తర్వాతే విదేశాలకు ఇవ్వాలని... అలాకాకుండా ముందే ఎలా విదేశాలకు ఎగుమతి చేస్తారన్నారు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై స్పందించిన హైకోర్టు జాతీయ ఔషధ ధర నియంత్రణ సంస్థకు నోటీసులు జారీ చేసిందని... తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేసినట్లు న్యాయవాది రామారావు తెలిపారు.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్‌తో నవీపేట వాసి మృతి