రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుండటం వల్ల పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కువ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు చేయాలని ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు 40 వేలకు పైగా టెస్టులు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించగా.... అవసరమైన చర్యలు చేపట్టాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుండగా... వాటి సంఖ్యను మున్ముందు మరింతగా పెంచనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తోన్న సంచార వాహన పరీక్షల మాదిరే జిల్లాల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు.
అవసరాల మేరకు తాత్కాలిక సిబ్బంది నియామకం...
గ్రామాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల తక్షణమే కట్టడి చర్యలను చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడెక్కడ నిర్ధరణ పరీక్ష కేంద్రాలు అవసరమవుతాయో ప్రతిపాదనలు పంపించాలని జిల్లా అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. పరీక్షల నమూనాల సేకరణకు, నిర్ధారణకు అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్లను, ఔషధాల అందజేతకు ఫార్మాసిస్టులను, ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చడానికి డేటా ఎంట్రీ ఆపరేటర్లను, వైద్యసేవలందించడానికి వైద్యులు, నర్సులను స్థానిక అవసరాల మేరకు తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
మరో 100 ఆస్పత్రులకు అనుమతులు...
మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలకు ఏర్పాట్లన్నీ చేస్తూనే... ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్సల నిర్వహణకు ముందుకొచ్చే వాటికి అనుమతులివ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 150 ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలకు అనుమతులివ్వగా.. వీటిల్లో సుమారు 90 ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. మరో 100 వరకూ ప్రైవేటు దవాఖానాలను అనుమతులివ్వాలని నిర్ణయానికొచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.