హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద వీధి శునకాల్లో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని పశువైద్యాధికారులు నిర్దరించారు. వాకర్లు ఆందోళన చెందకుండా నిరభ్యంతరంగా వ్యాయామం చేసుకోవచ్చని తెలిపారు. పార్కు వద్ద తిరిగే వీధి శునకాల్లో దగ్గు, ఆయాసం, నీరసం ఉండటం చూసి పలువురు కరోనా లక్షణాలుగా అనుమానిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో స్పందించిన 'పీపుల్స్ ఫర్ యానిమల్' అనే స్వచ్ఛంద సంస్థ... పార్కుకు చేరుకొని కుక్కల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంది.
ఆ సంస్థ పశు వైద్యులు డాక్టర్ హర్షద్.. కుక్కలను పరిశీలించి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల సంభవించే సాధారణ వ్యాధులేనని పేర్కొన్నారు. వాకర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాటికి జబ్బు తగ్గేలా టీకాలు ఇచ్చారు. కుక్కల నుంచి మనుషులకు, మనుషుల నుంచి కుక్కలకు కరోనా వైరస్ సోకినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు