హైదరాబాద్‌లో విద్యుత్ తీగలు దడ పుట్టిస్తున్నాయి. విద్యుత్‌పై పెరుగుతున్న లోడ్, నిర్వహణ గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్యలో ఉన్న హైటెన్షన్ తీగలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినా.. ఇప్పటి వరకు ఆ దిశగా విద్యుత్ సంస్థలు చర్యలు తీసుకోలేదు.
విద్యుత్ తీగల కిందే నిర్మాణాలు...
హైటెన్షన్ విద్యుత్ తీగల కింద నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా... ఎక్కడా అమలు కావడం లేదు. తీగల కింద ప్రస్తుతం వేలల్లో నిర్మాణాలు వెలిశాయి. భవనాలు నిర్మించేటప్పుడు పట్టించుకోని అధికారులు ఇప్పుడేమో ఇళ్లు నిర్మించుకున్న వారిదే తప్పని చెప్పి తప్పించుకుంటున్నారు. ఎల్బీనగర్, మలక్‌పేట్, యూసఫ్‌గూడ, ఎల్లారెడ్డిగూడలో హైటెన్షన్ విద్యుత్ తీగలు కిందికి వాలిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. యూసఫ్‌గూడ బస్తీ నుంచి శ్రీనగర్ కాలనీకి వెళ్లే మార్గంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. ట్రాన్స్‌కో, డిస్కం అధికారుల మధ్య సమన్వయలోపంతో తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
హైటెన్షన్ తీగలున్న ప్రాంతాలు...
అంబర్‌పేట, బహదూర్‌పురా, చార్మినార్, కంటోన్మెంట్, చాంద్రాయణగుట్ట, గోషామహల్, కూకట్‌పల్లి, కార్వాన్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, మలక్‌పేట, నాంపల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, రాజేంద్రనగర్, ఉప్పల్, యాకత్‌పురా, సికింద్రాబాద్, సనత్‌నగర్, రహ్మత్‌నగర్, బోరబండ, కార్మికనగర్, శివమ్మపాపిరెడ్డిహిల్స్లో ఇళ్లపై హైటెన్షన్ తీగలున్నాయి. ఉప్పల్‌లో 20కి పైగా కాలనీలు, కాప్రాలో 50కి పైగా కాలనీలు తీగల కిందే ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడ, యూసఫ్‌గూడ మెయిన్‌రోడ్డులో హైటెన్షన్ విద్యుత్ తీగలున్నాయి. బీరప్పగడ్డ, చిలుకానగర్, కాప్రా సర్కిళ్లలో మల్లాపూర్, నెహ్రూనగర్, అశోక్‌నగర్ కాలనీల మీదుగా హై టెన్షన్ లైన్లు వెళ్తున్నాయి.
ఇదీ చూడండి: ఈ జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ బిల్లుల 'మోత మోగదు'!