People Discussing About Telangana Elections : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పడు ఎక్కడా చూసినా.. ఏ నలుగురు పోగైనా ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. మన నియోజకవర్గంలో ఎవరెవరు నిలవడుతున్నారు.. ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిందనే ముచ్చట వినిపిస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియను దాదాపు పూర్తి చేస్తుండటంతో ఎక్కడ.. ఎవరు పోటీకి దిగుతున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే బీఫాంలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, అభ్యర్థిత్వం ఖరారైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీల నాయకులు ఇంటింటి ప్రచారమూ మొదలు పెట్టడంతో చర్చలు జోరందుకుంటున్నాయి.
'మన ఊరిలోకి ఆ పార్టీవాళ్లు ఎప్పుడు వస్తున్నారు. నిన్ననే జిల్లా కేంద్రంలో పెద్ద సారు మీటింగ్ అయిందంటా.. ఆ పార్టీ మనుషులు ఏమనంటున్నారనే' అంశాలపై గ్రామాల చౌరస్తాలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చింది.. ఎవరిని మార్చింది.. అందులో పోయిన ఎన్నికల్లో ఓడిపోయినా వారు ఉన్నరా.. ఇలాంటి అంశాలపైనా జనాలు దృష్టి పెడుతున్నారు. సమీప నియోజకవర్గాల్లో నిలబడుతున్న నేతలు ఎవరనే దానిపైనా వారు ఆసక్తి కనబరుస్తున్నారు.
Telangana Assembly Elections 2023 : మరోవైపు దీనికితోడు నియోజకవర్గ కేంద్రాలు మొదలు మండలాలు, పెద్ద గ్రామాల్లో ప్రచార రథాలతో మైకుల హోరు ప్రారంభమైంది. దీంతో ఇన్నాళ్లు రాజకీయాలను అంతగా పట్టించుకోని వారు కూడా చేస్తున్న పని ఆపి.. వాటిని పరిశీలిస్తున్నారు.
మేనిఫెస్టోలపై చర్చలు : ప్రధాన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలపై చర్చలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు టీవీలు, పేపర్లలోనే కనిపించిన హామీల ప్రచారం క్రమంగా గ్రామాల్లోకి చేరుతోంది. వీటిపై ప్రజల్లో చర్చ మొదలైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోల్లోని అంశాలు, బీజేపీ ఇస్తున్న భరోసాలు, బీఎస్పీ ఎజెండాపైనా అన్ని వర్గాలు ముచ్చటిస్తున్నాయి. ఒకే మాదిరి ఉన్న అంశాలు ప్రజల్లో ఆసక్తిని నింపుతున్నాయి. సాగు, మహిళా సంక్షేమం, పింఛన్లు, ఇళ్ల స్థలాలపై వారు అధికంగా మాట్లాడుకుంటున్నారు.
మండలానికో ప్రచార క్యాంప్ : ఎన్నికల ప్రక్రియకు జోష్ తేవడానికి పార్టీలు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు పోగయ్యేచోట ఇండ్లు, షట్టర్లు అద్దెకు తీసుకుని, పార్టీ జెండాలు, తోరణాలతో అలంకరిస్తున్నాయి. కార్యాలయం ముందు 15 వరకు కుర్చీలు, ఒక క్యారంబోర్డు, మంచినీరు ఏర్పాటు చేసి, మేనిఫెస్టో సిద్ధంగా ఉంచుతున్నాయి. కొన్ని పార్టీలు డీజే స్పీకర్లు పెట్టి సందడి తీసుకొస్తున్నాయి. మొత్తంగా ఈ ఏర్పాట్లలో బీఆర్‌ఎస్ ఇతర పార్టీలకన్నా కాస్త ముందుంది.
క్షేత్రస్థాయికి యువకులు, విద్యార్థులు : ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని పరిగెత్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన మహిళా సంఘాలను బరిలోకి దింపుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో చాలాచోట్ల వీటి ప్రచార బృందాలు సందడి చేస్తున్నాయి. వివిధ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థులు జట్లుగా మండలాలకు చేరుకుంటున్నారు. తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి కొన్ని బృందాలు క్షేత్రస్థాయికి చేరుకోగా మరికొన్ని వస్తున్నాయంటూ వరంగల్‌కు చెందిన ఓ నేత తెలిపారు.
అరె.. ఆళ్లు నిన్నమొన్న తిట్టుకున్నరుగదనే!
పట్టణాల కాలనీలు, బస్తీలు, పల్లెల్లో పార్టీలు మారిన నేతల తీరుపై లోతైన చర్చ జరుగుతోంది. నిన్నమొన్నటి వరకు ఒక పార్టీలో ఉండి ఎదుటోళ్లను తిట్టిని వ్యక్తి... ఇవాళ ఒక్కసారిగా అదే పార్టీల చేరిండేందే.. అంటూ ఫిరాయింపు దారులపైనా ఆసక్తికరంగా సంభాషించుకుంటున్నారు. ప్రజల వాట్సాప్ గ్రూపుల్లోనూ ‘నిన్న ఇట్ల.. ఇయ్యాల గిట్ల’ అని నాయకుల భుజాలపై కండువాలు మారుతున్న ఫొటోలు భారీగా షేర్ అవుతున్నాయి.
అభ్యర్థుల నేరచరిత్రను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్న పార్టీలు