రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మద్యం ప్రియులు ఉదయం నుంచే దుకాణాల వద్ద బారులుతీరారు. హైదరాబాద్ కూకట్పల్లి ఎల్లమ్మబండలోని బిందువైన్స్ వద్ద మందుబాబులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకపోవడం వల్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కేపీహెచ్‌బీ కాలనీలోని వైన్స్ వద్ద మహిళలు సైతం మద్యం కొనుగోలు చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
తిరుమలగిరిలో..
తిరుమలగిరిలోని ఓ వైన్స్ ఎదుట మందుబాబు నృత్యం చేస్తూ హల్చల్ చేశాడు. దాదాపు 42 రోజుల తర్వాత మద్యం లభిస్తుండటం వల్ల ఆనందాన్ని తట్టుకోలేక వైన్స్ ముందే గంతులు వేశాడు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో..
హైదరాబాద్ నగర శివారు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాల్లోనూ మందుబాబులు బారులుతీరారు. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ.. మద్యం ప్రియులు వాటిని పాటించడంలేదు.
సికింద్రాబాద్ పరిధిలో..
సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, అల్వాల్, చిలకలగూడ, మారేడ్‌పల్లి, బోయిన్పల్లి ప్రాంతాల్లోని దుకాణాల ఎదుటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మందుబాబులు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు.
మాదాపూర్, గచ్చిబౌలిల్లో..
హైదరాబాద్ మాదాపూర్, గచ్చిబౌలి, గోపనపల్లి ప్రాంతాల్లోనూ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూ కట్టారు. కొండాపూర్‌లోని ఓ దుకాణం ముందు మహిళలు సైతం మందు కోసం లైన్లలో నిలబడ్డారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో..
ముషీరాబాద్ నియోజకవర్గంలోని అన్ని మద్యం దుకాణాలు మందుబాబులతో కిక్కిరిసిపోయాయి. నియోజకవర్గ పరిధిలోని చిక్కడ్పల్లి, గోల్కొండ క్రాస్‌రోడ్డు, రామ్‌నగర్ క్రాస్‌రోడ్, ముషీరాబాద్, పార్సిగుట్ట ప్రాంతాల్లో దుకాణాలు తెరవక ముందు నుంచే మద్యం కోసం వరుసల్లో నిలబడ్డారు. రామ్‌నగర్ క్రాస్‌రోడ్‌లోని దుకాణం ముందు భౌతిక దూరం పాటించకుండా నిలబడ్డ వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
సనత్‌నగర్‌లో..
సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు మద్యం దుకాణాల వద్ద మందు బాబులు హడావిడి చేస్తుండటం వల్ల దుకాణ నిర్వాహకులు పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయించారు. ఫలితంగా కిలోమీటర్ మేర జనాలు బారులుతీరారు. పలు దుకాణాల ముందు స్త్రీలూ మద్యం కోసం నిలబడ్డారు.
అబిడ్స్‌లో..
మరోవైపు సుమారు 40 రోజుల తర్వాత దుకాణాలు తెరుచుకోవడం వల్ల అబిడ్స్‌లోని ఓ షాపు యజమాని కొబ్బరికాయ కొట్టి దుకాణాన్ని తెరిచారు. భౌతిక దూరం పాటించేలా దుకాణం ఎదుట ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.