పెండింగ్ దరఖాస్తులా! ఏం పర్వాలేదు. అన్నీ మేమే చూసుకుంటాం. వచ్చిన సొమ్ములో మాకూ వాటా ఇవ్వాలి. కాదంటే మాత్రం ఎప్పటికీ మీ దరఖాస్తు అక్కడే ఉంటుంది. మమ్మల్ని కాదని అక్కడ ఎవ్వరూ ఏమీ చేయరు...
ఇదీ నగరంలో కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిదారులకు వచ్చే సొమ్ములపై ఓ మధ్యవర్తి సాగించిన బేరం. మరో మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి దళారిగా మారి దరఖాస్తులను తొక్కిపడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏవో సాకులు చెబుతూ నిబంధనలకు అనుగుణంగా పత్రాలు జతచేయడంలేదంటూ లబ్ధిదారులను తరచూ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నట్లు సమాచారం. అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా కొన్నిచోట్ల అక్రమార్కులు అడ్డుపడుతున్నారు. జిల్లాలోని 16 మండలాల్లో ఆరు చోట్ల తరచూ ఇటువంటి ఆరోపణలే వస్తున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
కమీషన్ల కక్కుర్తి
లాక్‌డౌన్ ఆంక్షలతో రెవెన్యూ సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మీ-సేవ కేంద్రాలు కూడా మూసివేశారు. దీంతో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. మార్చి వరకు తహసీల్దార్ కార్యాలయాలకు చేరిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు చెక్కులు పంపిణీ చేశారు. కొన్ని మండలాల్లో మాత్రం దరఖాస్తులు మూలకు చేరాయి. రెండు మండలాల్లో దరఖాస్తులు అధికంగా ఉన్నట్లు సమాచారం. అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు వారి తరఫున విచారణకు కొందరు ప్రయివేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. వారి పరిధిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్‌లు మంజూరు జరగాలంటే వీరు అడిగినంత ముట్టజెప్పాల్సిందే. నగరం మధ్యలో ఉన్న ఓ మండల కేంద్రంలో ఏళ్ల తరబడి సాగుతున్న అక్రమాల తంతుపై ఇటీవల ఓ బాధితుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ ఇప్పటి పరిస్థితి
ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్యాలయాల్లో 6305 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నిచోట్ల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాకపోవటం, మరికొన్ని మండలాల్లో సిబ్బంది కొరత కారణంగా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అక్రమాలకు అలవాటుపడిన కొందరు సిబ్బంది దళారులతో కలసి దరఖాస్తుదారులను ఇబ్బందికి గురిచేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు వివరించారు. సకాలంలో నిధులు అందకపోవటం కూడా చెక్కుల పంపిణీలో ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. రెండుమూడు రోజుల్లో దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పరిష్కారం చూపేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం.
ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక