అటవీ అధికారులు, సిబ్బంది అంతా తమ పరిధిలోని పట్టణ, గ్రామాల్లోని నర్సరీలను ప్రతి 15 రోజులకోమారు విధిగా సందర్శించాలని అటవీసంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ స్పష్టం చేశారు. ఆరో విడత హరితహారం, నర్సరీలు, వన్యప్రాణి సంరక్షణ తదితర అంశాలపై అన్ని జిల్లాల అటవీ శాఖ అధికారులతో పీసీసీఎఫ్ శోభ దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు.
హరితహారం నిర్వహణ పకడ్బందీగా ఉండాలని... అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే బాధ్యత అటవీ శాఖదేనని శోభ స్పష్టం చేశారు. నర్సరీల్లో మొక్కలను తనిఖీ చేసి, రకాలు, ఎత్తును బట్టి గ్రేడింగ్ చేసేలా చూడాలన్నారు. గుంతల తవ్వకం, మట్టి స్వభావానికి తగిన మొక్కలు నాటే విధానంపై స్థానిక పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రతి పక్షం రోజులకోమారు...
హరితహారం మొక్కల నిర్వహణ గ్రామ పంచాయతీలు చేపట్టినప్పటికీ... ప్రతి 15 రోజులకోమారు నర్సరీలు, మొక్కలను పర్యవేక్షించి రికార్డుల్లో నమోదు చేయడంతోపాటు నోట్ కామ్ యాప్ ద్వారా ఫొటోలు తీసి పంపాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్న పీసీసీఎఫ్... కొన్ని గ్రామాల సర్పంచ్లకు నేరుగా ఫోన్ చేసి మరీ ఆరా తీశారు.
పర్యావరణంపై అవగాహన కల్పించాలి...
జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, ఆవశ్యకతను వివరించాలని చెప్పారు. కంపా నిధులతో చేపట్టిన పనులు, అటవీ ప్రాంతాల్లో నీటి కుంటల ఏర్పాటు, వర్షపు నీటి ఇంకుడు గుంతలు, మిడతల దండు నివారణ కోసం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చించారు.
మాక్ డ్రిల్స్ నిర్వహించాలి...
లాక్డౌన్తో పాటు, తీవ్రమైన వేసవి ప్రభావంతో అటవీ జంతువుల సంచారం జనవాసాల్లో పెరిగిందని పీసీసీఎఫ్ శోభ చెప్పారు. వన్యప్రాణులను కాపాడే సమయంలో కచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్ పాటించాలని స్పష్టంచేశారు. జంతువులకు హాని జరగకుండా, సిబ్బంది, ప్రజల రక్షణకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్లు నిర్వహించాలని తెలిపారు. అన్ని వన్యప్రాణి డివిజన్లలో ప్రోటోకాల్ను పాటిస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు.