congress jumbo committee : శాసనససభ ఎన్నికల సన్నద్ధమవడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. సామాజికవర్గం, అనుభవం, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ వ్యవహారాలు, పీసీసీ కార్యనిర్వాహక కమిటీల్లో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. సరిగ్గా పనిచేయని డీసీసీ అధ్యక్షులను మార్చాలని తొలుత భావించినప్పటికీ.. కొన్ని జిల్లాల సీనియర్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆ ప్రయత్నాలను విరమించుకున్నట్లు సమాచారం.
congress jumbo committee in telangana : గ్రేటర్ హైదరాబాద్‌ను ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాలుగా కాంగ్రెస్ విభజించింది. ఖైరతాబాద్ రెడ్డిలకు, హైదరాబాద్ ముస్లింలకు, సికింద్రాబాద్ యాదవులు లేదా మున్నూరు కాపు వర్గానికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, మల్కాజ్‌గిరి జిల్లా డీసీసీలను కొనసాగిస్తారని సమాచారం.
పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షుల విషయంలో.. ఎలాంటి మార్పులు చేయరాదని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నల్గొండకు చెందిన యువ నాయకుడికి మీడియా కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. సరిగ్గా పనిచేయని అధికార ప్రతినిధుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను 15కు తగ్గించినట్లు తెలుస్తోంది.
అత్యంత కీలకమైన పీసీసీ కార్యనిర్వహక కమిటీలో... దాదాపు 25 మంది కీలకమైన నాయకులకు చోటు కల్పించారు. ఈ కమిటీ ద్వారానే పార్టీ నిర్ణయాలను ఆమోదిస్తారు. 119 మందిని పీసీసీ కార్యదర్శులుగా నియమించనున్నారు. పూర్తిస్థాయిలో కసరత్తు చేసి... అన్ని వర్గాలకు కమిటీలో చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ఆమోదం పొందిన వెంటనే... కమిటీల ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవీ చదవండి: