రాష్ట్రంలో పంటనష్టం జరిగిన రైతులకు న్యాయం జరిగే వరకూ అన్నదాతల పక్షాన పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వరిపంటకు ఎకరానికి రూ.20వేలు, పత్తి పంటకు రూ.30 వేలు లెక్కన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిలతో జూమ్ యాప్ ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆదుకోలేదు..
ఎడతెరపి లేని వర్షాలతో రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఒక్కసారి కూడా రైతులకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకున్న పాపాన పోలేదని ఉత్తమ్ ఆరోపించారు.
పెట్టుబడికి, ఆదాయానికి పొంతన లేదు..
మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేది లేదని ప్రభుత్వం చెబుతుండటం వల్ల.. ఆ పంట పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారని ఉత్తమ్ అన్నారు. కనీస మద్దతు ధరతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్నలు కొనాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పినట్టు రైతులు సన్నరకం వరిపంట వేశారని, పెట్టుబడికి.. వస్తున్న ఆదాయానికి పొంతనలేదన్నారు. మద్దతు ధర రూ.1888లుగా ఉందని, అది ఏ మాత్రం సరిపోదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 600 రూపాయలు బోనస్ ఇచ్చి వరి రైతులను అదుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: 'భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటంలో రాజీపడే ప్రసక్తేలేదు'