జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనాభా ఆధారంగా బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించేలా ఉద్యమం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందుకోసం అటు న్యాయపోరాటం, ఇటు రాజకీయ పోరాటం చేసేందుకు తగిన ప్రణాళికల రూపకల్పనతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో పీసీసీ కోర్ కమిటీ సమావేశమైంది.
ప్రధానంగా నిన్న జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలు, అక్కడ భాజపా, అధికార తెరాస ఎత్తుగడలు, డబ్బు, మద్యం పంపిణీ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. అదే విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి పక్కా ప్రణాళికలతో ఎన్నికల బరిలో దిగాలని నేతలకు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్ సూచించారు.
ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, చిన్నా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌కృష్ణణ్, బోసురాజు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతురావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గురువారం నల్గొండలో ధర్నా: ఉత్తమ్