Revanth on JublieeHill Rape Case: హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్ దేవాలయంలో జరిగిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రేప్ ఎక్కడ జరిగిందో హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఒప్పందంలో భాగంగానే రఘునందన్‌రావు వీడియో బయటపెట్టారని ఆరోపించారు. నేరస్థులకు శిక్షపడేలా వ్వహరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొంటూనే సీఎం కేసీఆర్‌కు అఖిల పక్ష నేతలు లేఖ రాశామన్నారు.
పిల్లలను మిట్టమధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు పంపే పరిస్థితి లేదని అన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ అర్డర్ దారి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్... మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. విశ్వనగరంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నారని వివరించారు.
పెద్దమ్మ టెంపుల్ ఆవరణలో బాలికపై ఈ ఘటన జరిగింది. సర్కార్ ఎక్కడ జరిగిందో చెప్పడం లేదు. దేవుడినే రాజకీయాలకు వాడుకునే పార్టీ కూడా మాట్లాడదు. మైనర్ బాలికపై అత్యాచార ఘటన వీడియో కావాలనే బయటపెట్టారు. వ్యక్తుల ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తున్నారు. రేపటి తెలంగాణలో మాకు అధికారం వచ్చినా రాకపోయినా.. తెలంగాణ ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాం. - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ పోలీసుశాఖలో విధులను పంపిణీ చేయాలని సూచిస్తున్నట్లు రేవంత్ తెలిపారు. ఒక్కో అధికారికి రెండుకంటే ఎక్కువ బాధ్యతలు ఇచ్చారని విమర్శించారు. నచ్చినవాళ్లకు నజరానా.. నచ్చనివాళ్లకు జరిమానా అన్నట్లు చేస్తున్నారని ఆరోపించారు. చెప్పుచేతల్లో ఉండే అధికారులకు 5 శాఖలు ఇచ్చి మిగతా వారినే ఊరికే కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. సమర్థులైన కొందరు ఐపీఎస్‌లకు పోస్టింగ్ ఇవ్వకుండా కూర్చోబెట్టారని అభిప్రాయపడ్డారు. ప్రమోషన్ పొందిన వాళ్లను కూడా ఊరికే కూర్చోబెట్టారని పేర్కొన్నారు. కొంతమంది ఐపీఎస్‌లకు గంపగుత్తగా చాలా శాఖలు అప్పజెప్పారన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం రిటైర్డ్ అయిన వారికి రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చారని వెల్లడించారు. సమర్థులను పక్కనపెట్టి సామాజిక కోణాల్లో పోస్టింగ్‌లు ఇస్తున్నారని మండిపడ్డారు. ఒక అధికారి ఏడున్నరేళ్లుగా ఒకేస్థానంలో ఉన్నారని తెలిపారు. లబ్దిపొందిన అధికారులు చట్టానికి కాకుండా వ్యక్తికి విధేయులుగా ఉంటున్నారని చెప్పారు.
ఇదీ చూడండి: Gouravellli reservoir: గౌరవెల్లి పరిహారం చెల్లింపునకు ఎందుకింత ఆలస్యం..?