దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం భాజపా నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి నేటి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ ఈ విజయానికి మార్గం వేసిందని ప్రశంసించారు.
పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఆయన ఈ విజయాన్ని సాధించారన్నారు. రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజాసేవలో చూపే నిబద్దత ఆయనకు విజయహారాన్ని అందించిందని కొనియాడారు. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించటం యువత వల్లే సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తానని... ఈ ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం ఒక శుభపరిణామమని అన్నారు. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా పవన్ అభినందనలు తెలిపారు.
ఇదీచదవండి: గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగురవేస్తాం: బండి