భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో చాలా లోతుగా ఆలోచించి తాము నిర్ణయం తీసుకున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పొత్తు కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
పొత్తు విషయంలో ఇరు పక్షాల నుంచి ఎలాంటి షరతులు లేవని పవన్‌కల్యాణ్ వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలోనే భాజపాతో కలసి పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భాజపా ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు. లేని పక్షంలో అపోహలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి సమయం తీసుకున్నట్లు పవన్ పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం ఇక నుంచి నెలలో కొన్ని రోజుల పాటు సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జీ శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: యథావిధిగా శిరిడీ సాయిబాబా ఆలయ దర్శనం