హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసాలకు తెగబడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆలయ ఆస్తుల విధ్వంసానికి ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హిందూ మనోభావాల విఘాతానికి కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఏపీలో వరుస ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. జగన్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వల్లే దుండగులు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. విగ్రహాలు పగలగొడుతున్నా, రథాలను తగలబెడుతున్నా... ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే... నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నారని గుర్తు చేశారు. శత్రుదేశం పాటి చర్యలను కూడా వైకాపా ప్రభుత్వం తీసుకోలేదా? అని నిలదీశారు. ఈ దాడులను కట్టడి చేయాలంటే నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. హిందూ ఆలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించి... వాటి పునరుద్ధరణ చర్యలను తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: సాంకేతికాభివృద్ధిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం: మంత్రి కేటీఆర్