రైళ్లలోని ఏసీ బోగీల్లోని ప్రయాణికులకు బెడ్‌షీట్లు, రగ్గులు అందిస్తామన్న రైల్వేబోర్డు ప్రకటన పక్షం రోజులు దాటినా అమల్లోకి రాకపోవడంతో ప్రయాణికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. ట్వీట్లతో రైల్వే అధికారుల్ని ప్రశ్నిస్తున్నారు.
ఏసీ బోగీల్లో బెర్తు మీద పరుచుకోడానికి బెడ్‌షీట్లు, కప్పుకోడానికి రగ్గులు, తలకిందకు దిండ్లు సరఫరా చేస్తుంటారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల క్రితం రైల్వే వీటి సరఫరాను రద్దు చేసింది. కరోనా కేసులు బాగా తగ్గిపోవడంతో తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు మార్చి నెల 10న ప్రకటించిన రైల్వేబోర్డు- తక్షణమే అమలుచేయాలని అన్ని జోన్ల జనరల్ మేనేజర్లను ఆదేశించింది. కానీ ఇప్పటివరకు అవి అందుబాటులోకి రాలేదు.
ఎందుకు ఆలస్యం?: దుప్పట్ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ఇస్తారు. రైళ్లలో ప్రయాణికులకు అందించేందుకు, ప్రయాణం తర్వాత వీటిని తీసుకెళ్లడం వారి బాధ్యత. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఈ సేవల్ని నిలిపివేశారు. వారి సేవల్ని పునరుద్ధరించకపోవడం వల్లనే ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.
ఇవ్వకున్నా ఛార్జీలు: ఏసీ ప్రయాణానికి టికెట్‌లోనే బెడ్‌షీట్లు/రగ్గుల ఛార్జీలు కలిపి ఉంటాయి. వీటిని సరఫరా చేయకపోయినా డబ్బులు మాత్రం వసూలు చేస్తోంది రైల్వే. గరీబ్‌రథ్‌లో టికెట్ల ఛార్జీలు తక్కువ ఉంటాయి. వాటిలో కూడా బెడ్ రోల్‌కు అదనంగా రూ. 25 రైల్వే తీసుకుంటోంది.
- ఇదీ చదవండి : తెలంగాణలో పోలీసు కొలువులకు ఉచిత శిక్షణ