రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడు ఉపపోరులో.... జెండా ఎగురవేయటమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. విస్తృత ప్రచారాలతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే.... నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే నాయకులకు గాలం వేస్తున్నారు. ఇందుకోసం ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపా నాయకత్వమంతా నియోజకవర్గంలోనే మకాం వేసి.... గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చిట్టంపహాడ్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెరాసలో చేరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు... మోదీ కుట్రలో భాగంగానే రాజగోపాల్‌రెడ్డి 18వేల కోట్లకు అమ్ముడుపోయి... ముునుగోడులో ఉపఎన్నిక తెచ్చారని మంత్రి ఆరోపించారు. పసునూరులో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మునుగోడు మండలం కొరటికల్‌లో తెరాస కార్యకర్తలతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మునుగోడు అభివృద్ధికి పైసా నిధులివ్వని కమలం నేతలకు ఓట్లడిగే హక్కు లేదని పువ్వాడ అన్నారు.
మునుగోడు పల్లెల్లో కమలదళం విస్తృత ప్రచారం సాగిస్తోంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జైకేసారంలో భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా చండూరులో మరోసారి పోస్టర్లు వేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల... దొంగసంస్థల పేరుతో.. తెరాసనే ఇలాంటి చర్యలకు పాల్పడిందని విమర్శించారు. చౌటుప్పల్ మండలంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తమ పార్టీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాలి మడమ నొప్పుతో బాధపడుతున్న ఆయన.... పట్టీతో ప్రచారంలో పాల్గొన్నారు. లింగోజీగూడెం, తాళ్లసింగారం, లింగారెడ్డిగూడెం, చౌటుప్పల్‌లోని రాంనగర్, రత్నానగర్‌లో ఓట్లు అభ్యర్థించిన కిషన్‌రెడ్డి.... ఉపఎన్నిక వచ్చినప్పుడే మునుగోడు దత్తత గురించి కేటీఆర్‌కు గుర్తుకు వచ్చిందా... అని ప్రశ్నించారు.
సంస్థాన్ నారాయణపురం మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నిరసన సెగ తగలింది. కాంగ్రెస్ తరఫున గెలిపిస్తే భాజపాకు అమ్ముడు పోయారంటూ గుజ్జ హరిజనవాడలో పలువురు హస్తం పార్టీ శ్రేణులు ఆయనను అడ్డుకున్నారు. అక్కడి నుంచి సర్వేల్ మీదుగా కోతులాపురం గ్రామానికి చేరుకున్న రాజగోపాల్‌కు అక్కడా నిరసన ఎదురైంది. అభివృద్ధిపై గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సీపీఐ, కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు ప్రశ్నించారు. ఈ క్రమంలో తోపులాట జరగటంతో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. నిన్నరాత్రి కొత్తగూడెం, పుట్టపాక గ్రామాల్లోనూ కాంగ్రెస్ శ్రేణుల నుంచి భాజపా అభ్యర్థికి నిరసన తప్పలేదు. కొత్తగూడెంలో ప్రచారాన్ని అడ్డుకుంటున్న కాంగ్రెస్ కార్యకర్తపై రాజగోపాల్‌రెడ్డి ఉగ్రరూపం దాల్చారు.
మునుగోడు ఉపఎన్నికను నిజాయితీగా ఎదుర్కొంటామని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి చెప్పగలరా.... అంటూ మంత్రి కేటీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. తెరాస, భాజపా మరింత దిగజారి..... మునుగోడులో కాంగ్రెస్ బూత్‌స్థాయి నేతలను కొంటున్నాయని ఆయన విమర్శించారు. ఉపఎన్నికపై పోలింగ్ బూత్, క్లస్టర్, మండల ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమైన రేవంత్‌రెడ్డి.... ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు తాను నియోజకవర్గంలోనే ఉండి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క... నాంపల్లి మండలం పెద్దాపురం, రాందాస్ తండాలో ప్రచారం చేశారు. డప్పు కొడుతూ ప్రచారానికి వెళ్లిన ఆమె... అభివృద్ధిని కాంక్షించేవారంతా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటువేయాలని కోరారు.
మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో 130మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు అధికారులు ప్రకటించారు. పరిశీలన అనంతరం, నిబంధనల ప్రకారం 47మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించగా..... మిగతా 83మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించారు. రేపు మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తమ పార్టీ తరఫున ఒకటి.... స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ వేశారు. రాష్ట్రంలో ఆ పార్టీకి మనుగడ లేదంటూ.. ప్రజాశాంతి తరఫున వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేఏ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముంది.
ఇవీ చూడండి: