సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్ డివిజన్ భోలక్‌పూర్‌లో ఉన్న మేకల మండి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను హై స్కూల్‌గా రీ-లొకేట్ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా 480 విద్యార్థులతో ప్రాథమిక పాఠశాలగా కొనసాగుతోందని పాఠశాల హైస్కూల్ సాధన కమిటీ కన్వీనర్, నగర అధ్యక్షుడు చంద్రశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.
చుట్టు పక్కల పేద ప్రజలకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చాలని డిమాండ్ చేశారు. ఫలితంగా తమపై ఆర్థిక భారం తగ్గించాలని తల్లిదండ్రులు కోరుతున్నట్లు కమిటీ కన్వీనర్ తెలిపారు.
మూసేసిన దానితో రీ లొకేట్ చేయాలి...
నగరంలో మూసేసిన ఎదైనా ఉన్నత పాఠశాలను మేకల మండీ ప్రాథమిక పాఠశాలకు రీ-లోకేట్ చేసి ఆరో తరగతిని ప్రారంభించాలని కోరారు. ఇప్పటికే ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసి కోరామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిణి కూడా కలిసినట్లు వెల్లడించారు. ఉన్నత పాఠశాలగా రీ-లోకేట్ చేయకపోవడం పట్ల చంద్రశేఖర్ ప్రశ్నించారు.
ఇప్పటికే విద్యార్థులకు నష్టం..
ఇప్పటికే కరోనా కారణంగా విద్యార్థులు ఒక సంవత్సరం నష్టపోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఈ పాఠశాలలో ఐదో తరగతి పూర్తి చేసిన సుమారు 70 మంది విద్యార్థులకు ఆరో తరగతి ఎప్పుడు మొదలవుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారన్నారు. హైస్కూల్ రీలోకేట్ చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ ఛైర్మన్ పుల్లారావు, ఉన్నత పాఠశాల సాధన కమిటీ కో కన్వీనర్లు, సీనియర్ జర్నలిస్టులు బి.నర్సింగ్ రావు, శేషగిరిరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి : కరోనా కేసులపై హైకోర్టు విచారణ ఆగస్టు 13కి వాయిదా