కోర్టు ఆదేశాలు పాటించకుండా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మరింత దోపిడీ చేస్తున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఫీజుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా కాలంలోనూ పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల పేరుతో పిల్లలను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. కార్పొరేట్ పాఠశాలలు జీవో 46ను అమలు చేయట్లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యాల మొండి వైఖరిని నియంత్రించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పిల్లలను పరీక్షలు రాయనీయకుండా.. ఫీజుల కోసం బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలు పాఠశాలలు పాటించడం లేదని అన్నారు. దీనిపై విద్యాశాఖశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్యలు తీసుకోవాలని.. జీవో 46 అమలు చేయాలన్న తమ డిమాండ్లపై విద్యాశాఖ మౌనం వహిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.