Paperless activities in EPFO: ఉద్యోగుల భవిష్య నిధి క్లెయిమ్‌లు సహా పలు సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చిన ఈపీఎఫ్‌వో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో కాగిత రహిత పాలన అందించేందుకు కసరత్తు పూర్తిచేసింది. వచ్చే నెల నుంచి ఈ-ఆఫీస్ ద్వారా దస్త్రాలన్నీ పరిష్కరించాలని ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేసింది. కార్మికులు, వేతన జీవులకు సత్వర సేవల కోసం భవిష్య నిధి సంస్థ పలు సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది. కాగిత రహిత క్లెయిమ్‌లను ఆన్‌లైన్‌లోకి మార్చింది. దీంతో చందాదారులు ఆన్‌లైన్‌లోనే ఇంటి నిర్మాణం, కొనుగోలు, వైద్యం, వివాహాలు, పిల్లల చదువులు తదితర అవసరాల కోసం దరఖాస్తు చేసుకుని నగదు ఉపసంహరణలు చేస్తున్నారు. ప్రస్తుతం వారం నుంచి పది రోజుల వ్యవధిలో సాధారణ క్లెయిమ్‌లకు ఆమోదం లభిస్తోంది. ఈ-ఆఫీస్ పూర్తిస్థాయిలో అమలైతే మరింత వేగంగా నగదు సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమయ్యే అవకాశముంది.
ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ
ఈ-ఆఫీస్ అమలుకు ఉద్యోగులకు నిర్దిష్ట కార్యాచరణతో శిక్షణ పూర్తిచేయాలని ప్రాంతీయ కమిషనర్లకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఉద్యోగులందరికీ కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, డేటా కేబుల్ పాయింట్లు సిద్ధం చేయాలని కూడా కేంద్ర కార్యాలయం సూచించింది. ఈ-ఆఫీస్ అమలుకు ప్రాంతీయ కార్యాలయాల్లో నోడల్ అధికారులను నియమించాలని తెలిపింది. సెక్షన్ల వారీగా పీఎఫ్ ఉద్యోగులందరికీ లాగిన్, డిజిటల్ సంతకాల జారీకి అవసరమైన వివరాలను సేకరించాలనీ ఆదేశాలిచ్చింది.
ఈఎస్‌ఐసీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు
ఉద్యోగుల కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) జాతీయ స్థాయిలో 3500కుపైగా స్టెనో, ఎంటీఎస్, యూడీసీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ప్రాంతీయ కార్యాలయాలు తమ పరిధిలో అందుబాటులోని పోస్టులతో ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీచేశాయి. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. యూడీసీ, స్టెనో పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 25 ఏళ్లుగా ఖరారు చేశారు. తెలంగాణలో సాధారణ అభ్యర్థులకు 72, దివ్యాంగులకు 3, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు 15 పోస్టులు ఉన్నాయి. మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) కేటగిరీలో అత్యధికంగా 48, యూడీసీ 36, స్టెనో పోస్టులు 6 పోస్టులు ఉన్నాయి. ఏపీ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో సాధారణ అభ్యర్థులకు 35 పోస్టులు, దివ్యాంగులకు రెండు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు నాలుగు పోస్టులు ఉన్నాయి.
- కార్పొరేషన్ పరిధిలో జాతీయ స్థాయిలో మరో 1,120 బీమా వైద్యాధికారుల పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 31గా నిర్ణయించింది.
ఇదీ చదవండి: